December travel India: ఈ డిసెంబర్‌లో పర్యటించాల్సిన ప్రశాంతమైన ప్రదేశాలు.. అస్సలు వాయిదా వేయొద్దు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:31 PM
ఈ డిసెంబర్‌లో ప్రశాంతమైన టూరిస్టు స్పాట్స్‌కు హాలిడే ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు భారత్‌లో ప్రధానమైన ఆరు ప్రాంతాలకు తప్పక వెళ్లాలి. అవేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: టూర్‌లు వేసేందుకు డిసెంబర్ అద్భుతమైన కాలం. అయితే, ప్రస్తుతం ప్రముఖ పర్యాటక స్థలాలు అన్నీ రద్దీగా ఉంటాయి. దీంతో, ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారికి నిరాశ తప్పదు. అయితే, జనాల రద్దీగా తక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం మనం దేశంలో కొన్ని ప్రత్యేకమైన టూరిస్టు స్పాట్స్ ఉన్నాయి (Best Tourists spots in India To Visit In December).
షిల్లాంగ్
పచ్చదనం, ఆహ్లాదం కలిగించే వాతావరణానికి మేఘాలయలోని షిల్లాంగ్ పెట్టింది పేరు. ప్రశాంతమైన ఫ్యామిలీ టూర్‌కు ఈ ప్రదేశం అత్యంత అనుకూలం. ఇక్కడి పర్వతాలపై వ్యూ పాయింట్స్, రంగుల హరివిల్లులా ఉండే స్థానిక మార్కెట్‌లు, స్థానిక వంటకాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇక్కడకు టూర్‌పై వెళ్లే వారు కచ్చితంగా ఉమియమ్ సరస్సును, ఎలిఫెంట్ జలపాతాలను చూసి తీరాలి. గువహాటి వరకూ రైలు ద్వారా చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇతర వాహనాల్లో షిల్లాంగ్‌కు వెళ్లొచ్చు. షిల్లాంగ్ ఎయిర్‌పోర్టు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

హంపీ
కర్ణాటకలోని హంపీకి యూనెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉంది. ఇక్కడి చరిత్ర, ప్రాచీన నిర్మాణశైలి టూరిస్టులను ఆశ్చర్యపరుస్తుంటాయి. డిసెంబర్ నెలలో ఇక్కడి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జనాల రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చూడాలనుకునే వారికి ఈ సమయంలో హంపీకి వెళ్లి రావచ్చు. పురాతన కట్టడాల వైభవాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. విరూపాక్ష దేవాలయ సందర్శన, తుంగభద్రా నదిలో సంప్రదాయక కరోకల్ పడవ ప్రయాణం అద్భుత అనుభవాన్ని ఇస్తాయి. హంపీకి సమీపంలోని ఎయిర్‌పోర్టు హుబ్లీలో ఉంది. ఇక్కడికి 13 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ ఉండటంతో సులువుగా రైల్లో అక్కడకు వెళ్లొచ్చు. బెంగళూరు, గోవా నగరాల నుంచి రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు.

గోకర్ణ
బీచ్ అంటే చాలా మందికి గోవా గుర్తొస్తుంది. అయితే, అక్కడి రద్దీపై చాలా మంది విముఖత ప్రదర్శిస్తారు. కానీ ప్రశాంతమైన బీచ్‌లల్లో సముద్ర అలలను వీక్షిస్తూ కుటుంబంతో కలిసి సేద తీరాలనుకునే వారు కచ్చితంగా గోకర్ణకు వెళ్లాలి. ఈ టౌన్‌లో ట్రెక్కింగ్‌కు కూడా అవకాశం ఉంది. డిసెంబర్ వాతావరణం ఈ బీచ్ సందర్శనకు అత్యంత అనుకూలం. గోకర్ణకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. కాబట్టి రైల్లో ఇక్కడకు వెళ్లడం ఈజీ, రోడ్డు మార్గం కూడా అందుబాటులో ఉంది.

జిరో లోయ
గిరిజనుల సాంస్కృతిక వైభవానికి, పచ్చని ప్రకృతి అందాలకు జిరో లోయ పెట్టింది పేరు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ లోయ డిసెంబర్‌లో కొత్త సోయగాలను సంతరించుకుంటుంది. టూరిస్టు రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో హాలిడేని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలం. ఇక్కడ వరి చేలు, అపతానీ గిరిజన సంస్కృతి, స్థానిక రుచులు అద్భుత అనుభవాన్ని ఇస్తాయని అక్కడికి వెళ్లిన వారు చెబుతారు. జిరో వ్యాలీకి 100 కిలోమీటర్ల దూరంలో లిలాబరీ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిరో వ్యాలీకి చేరుకోవచ్చు. రాజధాని ఇటానగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా జిరో వ్యాలీకి వెళ్లొచ్చు.

డయ్యూ
ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారు, పోర్చుగీసు సంస్కృతిని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు డయ్యూను ఈ కాలంలో కచ్చితంగా సందర్శించాలి. ఇక్కడి చారిత్రక కోటలు, చర్చ్‌లు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. జనాల రద్దీ తక్కువ కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడి బీచ్‌లల్లో సేదతీరొచ్చు. డయ్యూకు వెళ్లేవారు అక్కడి డయ్యూ కోట, నగోవా బీచ్, సెయింట్ పాల్ చర్చ్‌ను కచ్చితంగా సందర్శించాలి. డయ్యూలోనే ఎయిర్‌పోర్టు ఉంది కాబట్టి విమానాల్లో ఎంచక్కా అక్కడ వాలిపోవచ్చు. డయ్యూకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెరావల్ స్టేషన్ వరకూ రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డయ్యూకు చేరుకోవచ్చు.

ఖజురహో
ఇక మధ్యప్రదేశ్‌లోని ఖజురహో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడి శిల్పకళను వర్ణించేందుకు భాష సరిపోదంటే అతిశయోక్తి కాదు. వారసత్వ విశేషాలతో పాటు జాతీయ వనాలు, ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడ పశ్చిమాన ఉన్న దేవాలయాల సముదాయాన్ని, అక్కడ ఏర్పాటు చేసే లైట్ అండ్ సౌండ్ షో, రానే జలపాతాలను కచ్చితంగా చూసి రావాలి. ఖజురహో ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఉంటుంది కాబట్టి ఫ్లైట్‌లో అక్కడకు చేరుకోవడం చాలా ఈజీ. ఖజురహోకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఝాన్సీ, సత్నా జిల్లాల నుంచి రోడ్డు మార్గం మీదుగా కూడా ఖజురహోకు చేరుకోవచ్చు.

Also Read:
వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టౌన్‌కు వెళ్లి రావాలి!
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
For More Lifestyle News