Sonakshi Sinha: సల్మాన్... నా ప్రేమకథకు సూత్రధారి!
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:40 AM
బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, అలియాభట్, జాన్వీకపూర్ ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ జాబితాలో తాజాగా సోనాక్షి సిన్హా వచ్చి చేరింది. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’తో తెలుగులోకి అడుగుపెట్టిందీ స్టార్‌కిడ్.
బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, అలియాభట్, జాన్వీకపూర్ ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ జాబితాలో తాజాగా సోనాక్షి సిన్హా వచ్చి చేరింది. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’తో తెలుగులోకి అడుగుపెట్టిందీ స్టార్‌కిడ్. ఈ సందర్భంగా ఈ బీటౌన్ బ్యూటీ పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...
బొద్దుగా ఉన్నానని...
చిన్నప్పటి నుంచే బొద్దుగా ఉండేదాన్ని. తోటి విద్యార్థులు నన్ను రకరకాల నిక్‌నేమ్స్‌తో ఏడిపించేవారు. మొదట్లో కాస్త బాధపడినా, ఆ తర్వాత వినడం మానేశా. నాలో ఉన్న ప్రత్యేకతలపై దృష్టి పెట్టడం మొదలెట్టా. ఆటలపోటీల్లో బాగా రాణించేదాన్ని. దాంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసేప్పుడు కూడా చాలామంది నా శరీరాకృతి, బరువు విషయంలో రకరకాలుగా మాట్లాడేవారు. అయితే నాకు నచ్చినట్లుగా ఉండటాన్నే ఇష్టపడేదాన్ని.
సేవా కార్యక్రమాల్లో ముందుంటా

నాకు కుక్కలు, పిల్లులంటే ప్రేమ. చిన్నప్పుడు వీధిలో ఎక్కడైనా అవి గాయాలతో కనిపిస్తే నా మనసు విలవిల్లాడిపోయేది. ఇంటికి తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసేదాన్ని. ఇప్పటికీ నా సంపాదనలో కొంత మొత్తాన్ని వాటి షెల్టర్లకు డొనేట్ చేస్తుంటా. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తుంటా. నా మొదటి రెమ్యునరేషన్ (‘దబాంగ్’) కూడా ఛారిటీకి ఇచ్చేశా.
కుంచెతో స్నేహం
నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడమంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే స్కూల్లో పెయింటింగ్ పోటీల్లో పాల్గొని, బోలెడన్ని బహుమతులు గెలుచుకున్నా. ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే కుంచె పట్టి నా సృజనాత్మకతకు రంగులద్దుతా. వాటిని ఎగ్జిబిషన్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా అమ్మి, వచ్చిన మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోస్తా. ప్రయాణాల్లో కూడా మినీ స్కెచ్‌బుక్ వెంట తీసుకెళ్తా.
దర్శకులు మెచ్చే నటిగా...

మూస ధోరణి కథల్లో నటించ్చొదనుకుంటా. దర్శకులు మెచ్చే నటిగా ఉండాలనేది నా కోరిక. ‘ఈ అమ్మాయి జానర్ ఏదైనా... పాత్ర ఎంత వైవిధ్యంగా ఉన్నా కచ్చితంగా బాగా నటించగలదు’ అని నిర్మాతలు భావించాలి. స్వాతంత్య్ర సమరయోధురాలు, అథ్లెట్ బయోపిక్స్, పీరియాడిక్ చిత్రాల్లో నటించాలనుంది.
ఇప్పటికీ తన గర్ల్‌ఫ్రెండ్‌నే...
గతేడాది జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేశా. సల్మాన్‌ఖాన్ ఏర్పాటుచేసిన ఓ పార్టీలో మా ప్రేమకథ ప్రారంభమైంది. అక్కడే నేను మొదటిసారి జహీర్‌ను కలిశా. నిజం చెప్పాలంటే మా కథకు సూత్రధారి సల్మానే. ఆయన వల్లే మేము కలిశాం. మేమిద్దరం కలిసి ఓసారి ఫిన్లాండ్ వెకేషన్‌కి వెళ్లాం. అక్కడే నాకు జహీర్ ప్రపోజ్ చేశాడు. నేను కూడా వెంటనే అంగీకారం తెలిపా. నన్ను ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంచుతాడు. భార్యలా కాకుండా ఇప్పటికీ తన గర్ల్‌ఫ్రెండ్‌లానే ఫీలవుతుంటా.
పర్సనల్ ఛాయిస్
- కొత్త కొత్త హెయిర్ స్టైల్, మేకప్ లుక్, నెయిల్ ఆర్ట్ ట్రై చేయడం సరదా. ‘సో ఈజీ’ అనే సొంత నెయిల్ బ్రాండ్ కూడా ఉంది.
- నా దగ్గర 198 సన్‌గ్లాసెస్ ఉన్నాయి.
- విహారయాత్రలకు వెళ్తే అక్కడి వింటేజ్ యాక్ససరీస్, హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్, ఫ్యాబ్రిక్స్ కొంటుంటా.
- మెట్లు ఎక్కితే తెలియకుండానే వాటిని లెక్కపెట్టేస్తా. చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటది.
- నిద్రలో కూడా సినిమా డైలాగ్స్ చెబుతుంటానట. మా అమ్మ చెబుతుంది.
- నా సెలబ్రిటీ క్రష్ హృతిక్ రోషన్. ‘కహో నా ప్యార్ హై’ సినిమాను థియేటర్లో 10 సార్లు చూశా.
- ఇష్టమైన రంగు తెలుపు. నా వార్డ్‌రోబ్‌లో సగానికిపైగా తెలుపురంగు దుస్తులే ఉంటాయి.