Air Recirculation: కారులో ఇంధనాన్ని ఆదా చేయాలనుకుంటున్నారా.. ఈ ఒక్క బటన్‌ను ప్రెస్ చేస్తే..
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:55 PM
పెట్రోల్, డీజిల్ కార్లలో ఇంధనం పొదుపు చేద్దామనుకునే వారు చిన్న చిట్కా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని కార్లలో ఉండే ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్‌ను తగిన సందర్భాల్లో వాడితే ఏసీపై ఒత్తిడి తగ్గి ఇంధనం పొదుపు అవుతుందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కారు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, దాదాపు అన్ని కార్లలో ఉండే ఓ బటన్‌ను ప్రెస్ చేస్తే ఇంధనాన్ని సులువుగా పొదుపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు (Car Fuel Saving Button).
నిపుణులు చెప్పేదాని ప్రకారం, కార్లల్లోని ఎయిర్ రీసర్క్యులేషన్ స్విచ్ ఇంధన పొదుపునకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కారు డ్యాష్ బోర్డుపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. చాలా మంది ఈ బటన్‌ను సరిగా వినియోగించరు. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగి ఇబ్బంది పడుతుంటారు (Air Recirculation Button).
ఈ రీసర్క్యులేషన్ బటన్‌ను ప్రెస్ చేసినప్పుడు కారులోని ఏసీ వ్యవస్థ బయటి గాలిని లోపలకు తీసుకోదు. కారులో ఉన్న గాలినే రీసైకిల్ చేసి, చల్లబరిచి కారులోకి వదులుతుంది. దీని వల్ల కారు ఇంజన్‌పై భారం చాలా వరకూ తగ్గుతుంది. నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఏసీలోని కంప్రెసర్ ఎంత ఎక్కువగా పనిచేస్తే కారు ఇంజన్‌పై అంత ఎక్కువ ప్రభావం పడుతుంది. బయటి గాలిని చల్లబరిచేందుకు కంప్రెసర్ ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. దీంతో, ఇంజన్‌పై భారం పెరిగి ఇంధన వినియోగం ఎక్కువవుతుంది. కారులోని చల్లని గాలినే మళ్లీ రీసర్క్యులేట్ చేస్తే ఏసీ, ఇంజన్‌పై ఒత్తిడి తగ్గి ఇంధనం ఆదా అవుతుంది. కారులోని ఎయిర్ ఫిల్టర్ కూడా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.
ఈ చిట్కాను సరిగ్గా వాడుకుంటే ఇంధన వినియోగం 10 శాతం మేర తగ్గే అవకాశం ఉంది. అయితే, రీసర్క్యులేషన్ ఎంత మేర సమర్థవంతంగా పనిచేస్తుందనేది బయటి వాతావరణం, డ్రైవింగ్ పరిస్థితులు, గాల్లో తేమ శాతం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇక కార్ల అద్దాలపై తేమ పేరుకున్నా లేక లోపల గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నా రీసర్క్యులేషన్ ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ఎయిర్ రీసర్క్యులేషన్‌ను అవసరమైనప్పుడు వాడుకుంటే ఇంధనాన్ని పొదుపు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ప్రయాణాల్లో వెంట ఉండాల్సిన 8 గ్యాడ్జెట్స్
విహారయాత్రకు వెళ్లే వారి స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి