Share News

నగరం మధ్యలో పిల్ల కాలువలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:45 AM

నగరాల్లో రోడ్లపైన వాన నీరు ఏరులై పారడం తెలుసు. ఆ వరద కాలువల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ సంగతి సరే సరి. అలాకాకుండా రోడ్డువారగా అందంగా, నిరంతరం కాలువల్లో పారుతున్న నీటిని ఎప్పుడైనా చూశారా? సాధారణంగా వర్షం పడితే... ప్రవహించే వరద నీటిలో పిల్లలు కాగితం పడవలు వేస్తూ ఆడుకోవడం చూస్తుంటాం.

నగరం మధ్యలో పిల్ల కాలువలు

నగరాల్లో రోడ్డు మీద నడిచి వెళు తుంటే.. పక్కనే పిల్ల కాలువలు నిరంతరం ప్రవహిస్తుంటే... చూడటానికి భలేగా ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు... చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆ కాలువల చెంత సేద తీరుతూ ఉంటారు. జర్మనీలోని ఫ్రేబర్గ్‌ నగరంలో కనిపిస్తుందీ అరుదైన దృశ్యం. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ కెనాల్స్‌ వల్లే ఆ నగరానికి ప్రత్యేక శోభ వచ్చింది.

నగరాల్లో రోడ్లపైన వాన నీరు ఏరులై పారడం తెలుసు. ఆ వరద కాలువల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ సంగతి సరే సరి. అలాకాకుండా రోడ్డువారగా అందంగా, నిరంతరం కాలువల్లో పారుతున్న నీటిని ఎప్పుడైనా చూశారా? సాధారణంగా వర్షం పడితే... ప్రవహించే వరద నీటిలో పిల్లలు కాగితం పడవలు వేస్తూ ఆడుకోవడం చూస్తుంటాం. అయితే జర్మనీలోని ఫ్రేబర్గ్‌ అనే నగరంలో మాత్రం వర్షంతో సంబంధం లేకుండా... పిల్లలు ఏడాదంతా కాలువల్లో కాగితం పడవలతో ఆడుకుం టుంటారు. ఆ నగరంలో దారుల వెంట ఉన్న కాలువలు పిల్లలకు ఆట కేంద్రాలుగా మారతాయి. స్వచ్ఛమైన నీటితో ప్రవహించే చిన్న చిన్న కాలువలు అందరికీ రిక్రియేషన్‌ స్థలాలుగా ఉపయోగపడతాయి. నగర వీధుల్లో షాపింగ్‌ కోసం వెళ్లిన వారంతా కాలువ నీళ్లలో కాళ్లు పెట్టి సేద తీరుతూ కనిపిస్తారు. ఫ్రేబర్గ్‌ నగరంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా దృశ్యం కనిపించదంటే నమ్మండి.


book8.2.jpg

స్నేహపూర్వక పురాతన నగరం...

ఒక్క మాటలో చెప్పాలంటే... చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురాతన నగరం ఫ్రేబర్గ్‌. బ్లాక్‌ ఫారెస్ట్‌ సమీపంలో ఉంటుంది. హైకింగ్‌, సైక్లింగ్‌, స్కీయింగ్‌ వంటి ఆటలకు ప్రసిద్ధి. ఈ నగరం చుట్టుపక్కల ప్రకృతి అందాలకుకొదవేం లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం స్థానికులు కట్టుబడి ఉంటారు. ‘గ్రీనెస్ట్‌ సిటీ’లలో ఫ్రేబర్గ్‌ ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాదు... సైక్లింగ్‌ ఫ్రెండ్లీ సిటీగానూ పేరుంది. అయితే వీటన్నింటిలోకి ఈ పిల్ల కాలువలే ప్రధాన ఆకర్షణ. రహదారుల మధ్యలో ఉన్న కాలువల వెంట నడుస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అప్పుడప్పుడు కొందరు ఆ కాలువల్లో జారి పడిపోతుంటారు. ఒకవేళ ఆ నగరానికి చెందని పెళ్లి కాని వ్యక్తులు ఎవరైనా ఆ కాలువలో కాలు జారి పడితే... ఫ్రేబర్గర్‌ను వివాహం చేసుకుంటారని, అది దైవ నిర్ణయమని చెబుతుంటారు స్థానికులు. అయితే ఆ మాటలు విని సరదాగా నవ్వుకుంటారంతే.


book8.3.jpg

శతాబ్దాల చరిత్ర...

నగరంలో పారే ఈ పిల్ల కాలువలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1220లో ఆ కెనాల్స్‌ను మొదటిసారి డాక్యుమెంట్‌ చేశారు. ఫ్రేబర్గ్‌ నగరం ఏర్పడటానికి వందేళ్ల ముందే ఈ కెనాల్స్‌ ఉన్నట్టు పురావస్తుశాఖ తవ్వకాల ఆధారంగా తేల్చారు. ఈ కాలువలన్నీ రాళ్లతో నిర్మించారు. వీటిలో ప్రవహించే నీళ్లు స్వచ్ఛంగా, చల్లగా ఉంటాయి. అక్కడి డ్రెయిసం నది నుంచి నీరు ఈ కెనాల్స్‌ ద్వారా నగరానికి వస్తుంది. నగర ప్రజలకు నీరు అందించడం కోసం, జంతువులకు తాగు నీరు కోసం, అగ్నిప్రమాదాలను ఆర్పేందుకు ఈ కెనాల్స్‌ను నిర్మించారు.


అయితే అవే కెనాల్స్‌ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని ఎవరూ ఊహించలేదు. శతాబ్దాల క్రితం నిర్మించినప్పుడు కెనాల్స్‌లో నీరు సాఫీగా సాగిపోయేది. నగరం విస్తరించడం, ఎత్తు పెంచడం తదితర కారణాలవల్ల నీరు సాఫీగా వెళ్లేలా చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో పాతనగరాన్ని మూడుమీటర్ల వరకు ఎత్తు పెంచారు. ఎవరైనా కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు వేస్తారు. ఈ కాలువల్లో సరదాగా చిన్న చిన్న పడవల రేసులు కూడా నిర్వహిస్తుంటారు. వాటిని ‘బాచ్లే బూట్‌ రేస్‌’ అని పిలుస్తారు. మొత్తానికి ఈ పిల్ల కాలువలను చూసేందుకు ఫ్రేబర్గ్‌ నగరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.

Updated Date - Aug 31 , 2025 | 10:45 AM