Rakul Preet Singh: ఆరోజు సరదా ఆటలెన్నో...
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:31 AM
ఓవైపు దుర్గాదేవీ పూజలు... మరోవైపు దాండియా ఆటలు... ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా దసరా శోభతో కళకళలాడుతుంది. విజయదశమి (అక్టోబర్ 2) సందర్భంగా కొందరు తారలు ఈ పండగతో తమకున్న అనుభవాలను పంచుకున్నారిలా...
దుర్గ పూజలు... దాండియా ఆటలు...
ఓవైపు దుర్గాదేవీ పూజలు... మరోవైపు దాండియా ఆటలు... ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా దసరా శోభతో కళకళలాడుతుంది. విజయదశమి (అక్టోబర్ 2) సందర్భంగా కొందరు తారలు ఈ పండగతో తమకున్న అనుభవాలను పంచుకున్నారిలా...
సరదా ఆటలెన్నో...
మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు. నా చిన్నప్పుడు మేము ఆర్మీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. సాధారణ రోజుల్లోనే ఆర్మీ కుటుంబాల పిల్లలందరం కలిస్తే... ఒక పెద్ద పండగలా ఉండేది. దసరా సెలవుల్లో మా సరదాలు రెట్టింపయ్యేవి. పిల్లలందరం కలిసి బెలూన్ షూటింగ్, పరుగు పందేలు, మ్యూజికల్ చైర్స్... ఇలా ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్లం. పండక్కి చేసే ప్రత్యేక వంటకాల్ని ఆస్వాదించేవాళ్లం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత, షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా దసరా పండక్కి మాత్రం ఇంటికి చేరిపోతా. కుటుంబంతో కలిసి గడుపుతా.
- రకుల్ ప్రీత్‌సింగ్
ఉపవాసం ఉంటా...

నాకు దసరా అంటే ఠక్కున గుర్తొచ్చేవి.. పూజలు, ఉపవాసాలు. ఆ తొమ్మిది రోజుల పాటు మా అమ్మతో పాటు నేనూ ఉపవాసం ఉంటా. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తా. ఆ తర్వాత స్నేహితులతో కలిసి, నచ్చిన వంటకాలను ఆస్వాదిస్తా. చిన్నప్పుడు కుటుంబమంతా కలిసి రామ్‌లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనేవాళ్లం. దసరా రోజు అక్కడ జరిగే రావణ దహనం కన్నుల పండువగా ఉండేది.
- రాశీ ఖన్నా
అరిటాకు భోజనం

ఏటా దసరా నవరాత్రుల్లో మా ఇంట్లో హోమం, ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి. ఆ తొమ్మిది రోజులు ఇంట్లో అందరం పూర్తిగా శాకాహారులుగా మారిపోతాం. ఇక దసరా రోజు అయితే కుటుంబమంతా కలిసి అరిటాకుల్లో భోజనం చేస్తాం. మా అమ్మ ఆ రోజు ప్రత్యేకంగా 19 రకాల వంటకాలు చేస్తుంది. నేనైతే ఆ ఐటమ్స్ కోసమే దసరా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటా. దేవీ నవరాత్రుల్లో దాండియా, గర్బా నృత్యాలతో మా ఇంటి ఆవరణంతా తెగ సందడి నెలకొంటుంది.
- పూజా హెగ్డే
రోజుకో రంగు...

నాకు ఇష్టమైన పండగల్లో దసరా ఒకటి. నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో అమ్మవారిని పూజిస్తాం. నేను తొమ్మిది రోజులూ తొమ్మిది రంగుల దుస్తులు ధరిస్తుంటా. మొదటిరోజు శాంతి, ప్రశాంతత, స్వచ్ఛతకు సంకేతమైన తెలుపు రంగు దుస్తులు... రెండో రోజు విజయం, శక్తికి ప్రతీకైన ఎరుపు రంగు వస్త్రాలు ఽధరిస్తా. అలాగే మూడో రోజు నీలం, నాలుగో రోజు పసుపు, ఐదో రోజు ఆకుపచ్చ, ఆరో రోజు బూడిద, ఏడో రోజు నారింజ, ఎనిమిదో రోజు నెమలి ఆకుపచ్చ, తొమ్మిదో రోజు గులాబీ రంగు దుస్తులు ధరిస్తుంటా.
- శ్రద్ధాకపూర్
థియేటర్లో సినిమా చూస్తాం...

చిన్నప్పుడు దసరా పండక్కి చెన్నైలో ఉండే మా పిన్నివాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. మా పిన్ని బొమ్మల కొలువు పెడుతుండేది. కొత్త కొత్త బొమ్మల్ని, వివిధ రకాల అవతారాల్లో అందంగా పేర్చడం... అప్పట్లో భలే సరదాగా అనిపించేది. నాకు బాగా గుర్తున్న దసరా జ్ఞాపకం అంటే... చిన్నతనంలో మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్లం. దాండియా ఆటపాటలతో ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్లం. విజయదశమి రోజున అమ్మ చేసే చింతపండు పులిహోర, కొబ్బరి పాల పాయసం నాకు ఎంతో ఇష్టం. నేను, చెల్లి ఇద్దరం పండక్కి మ్యాచింగ్ దుస్తులు వేసుకునేవాళ్లం. దసరా రోజున విడుదలయ్యే చిత్రాల్ని కుటుంబమంతా కలిసి థియేటర్‌కి వెళ్లి చూడడం మాకు అలవాటు.
- శివానీ రాజశేఖర్