Share News

ఒకే ఒక్కడు.. 15 లక్షల పుస్తకాలు...

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:42 AM

రాజులు, సాహితీవేత్తలు, తత్వవేత్తలు.. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు, విజేతలు, కళాకారులు, మతబోధకులు, ఆవిష్కర్తలు.. ఒకరా.. ఇద్దరా.. అనేకులు. వేలు, లక్షల మంది జీవితకథలు.. భద్రంగా ఉన్నాయి. లోపలికి వెళుతూనే ఊపిరాడనీయవు. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఒకే ఒక్కడు.. 15 లక్షల పుస్తకాలు...

మానవజాతి పరిణామక్రమానికి, సామాజిక వికాసానికి సజీవ సాక్ష్యంలా నిలిచేది ఒకే ఒక్కటి.. అది కాగితంపైన ముద్రించిన అక్షరం. అంటే.. పుస్తకం...!. ఆ విలువ బంగారంకన్నా, వజ్రవైడూర్యాలకన్నా ఖరీదైనది! అంతకన్నా అమూల్యమైనది!! పుస్తకాలకున్న ఆ విలువ కొందరికే తెలుసు.. అలాంటి మహానుభావుల్లో ఒకరు కర్ణాటకలోని మాండ్య జిల్లా, హరళహళ్లికి చెందిన అంకేగౌడ. ఆయన చిరుద్యోగి అయినా సరే... యాభై ఏళ్లపాటు అష్టకష్టాలు పడి.. పదిహేను లక్షల పుస్తకాలను సేకరించి.. సొంత లైబ్రరీని నెలకొల్పాడు.. ఇన్నేసి పుస్తకాలు సేకరించిన వ్యక్తి మన దేశంలో మరొకరు లేరంటే లేరు..

‘‘రాజులు, సాహితీవేత్తలు, తత్వవేత్తలు.. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు, విజేతలు, కళాకారులు, మతబోధకులు, ఆవిష్కర్తలు.. ఒకరా.. ఇద్దరా.. అనేకులు. వేలు, లక్షల మంది జీవితకథలు.. భద్రంగా ఉన్నాయి. లోపలికి వెళుతూనే ఊపిరాడనీయవు. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎవరి గురించి తెలుసుకోవాలో.. ముందుగా ఎవరి కథలు చదవాలో అర్థం కాదు. సారస్వత యుద్ధ ప్రపంచంలో నెత్తుటి చుక్కను స్పర్శించాలా? అమృత బిందువును ఆస్వాదించాలా? చరిత్రపొరల్లో ఇంకిన కన్నీటిబొట్లను పరామర్శించాలా? ఏది చదవాలి? ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టలేనట్లు.. సముద్రతీరంలో ఇసుక రేణువులను అంచనావేయలేనట్లు... అక్కడున్నవి ఎన్ని పుస్తకాలో చెప్పలేం!. కళ్లతో చూసి.. మనసు నింపుకొని.. ఏదో ఒక పుస్తకం తీసుకుని నాలుగుపేజీలు తిప్పేయాల్సిందే!. ఎందుకంటే జీవితాంతం చదివినా పూర్తికాని పుస్తకలోకం ఇది! కర్ణాటకలోని మాండ్య జిల్లాకేంద్రానికి దగ్గర్లోని పాండవపుర తాలూకాలో ఉందీ పుస్తకాల ఊరు. దాని పేరు హరళహళ్లి. ఆ పుస్తక ప్రపంచ సౌధాన్ని నిర్మించిన త్యాగధనుడు అంకేగౌడ.


బాల్యం నుంచే..

‘‘ఒరే నాయనా.. పెద్దయ్యాక నువ్వేమవుతావో తెలీదు. ఎప్పుడు చూసినా ఆ పుస్తకాల పిచ్చే నీకు. తినడానికే తిండి లేనోళ్లం. ముందు బతకడం ఎలాగో నేర్చుకో!. ఈ పేదరికం నుంచి గట్టెక్కడానికి ప్రయత్నించు. అంతేకానీ.. ఇరవై నాలుగ్గంటలూ పుస్తకాలు పట్టుకుని మమ్మల్ని విసిగించకు.. పది పైసలు చేతిలో పడగానే ఏదో ఒక పుస్తకం కొంటావు.. ఎలారా ఇలాగైతే... ఎలా బతుకుతావు?’’

book6.2.jpg

తల్లిదండ్రులైన మరిగౌడ, నింగమ్మ ఆపకుండా తిట్టేశారు.. కొడుకు అంకేగౌడ స్థిరచిత్తంతో మౌనంగా ఉండిపోయాడు. కాసేపయ్యాక.. తలపైకెత్తి.. ఆకాశంవైపు చూశాడు. ‘‘నాన్నా.. నింగిలో సూర్యుడు ఈ ప్రపంచానికి ఎంతటి వెలుగును అందిస్తున్నాడో.. ఈ పుస్తకాలు కూడా అంతే జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఇవే కనక లేకపోతే.. మానవ వికాసానికి అవకాశమే లేదు. పుస్తకాలకన్నా మించిన సారస్వత సంపద ఈ లోకానికి మరొక్కటి లేదు.. అందుకే నేనో చిన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాను. చేతిలో ఉన్న ఈ పుస్తకమే మన ఇంటికి, మన ఊరికి చిరునామా అవుతుంది’’ అన్నాడు. అప్పట్లో అంకేగౌడ కొన్న తొలి పుస్తకం ధర రూ.0.25 పైసలు. ఆయన వయసు 21 ఏళ్లు.


మరిగౌడ, నింగమ్మల సొంతూరు కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన ‘కెన్నాళ్లు’. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. పెద్దగా పూర్వపు ఆస్తిపాస్తులేమీ లేవు. వీరి కుమారుడే అంకేగౌడ. మాండ్య జిల్లా చుట్టుపక్కల చెరకును ఎక్కువగా పండించేవారు రైతులు. దాంతో చక్కెర తయారీ పరిశ్రమలు వచ్చాయి. అప్పట్లో పరిసర పల్లెటూరోళ్లకు అందులో చిరుద్యోగం దొరికితే చాలు.. అదే పరమాన్నం. ఆ నౌకరీలతోనే పెళ్లిళ్లు కూడా అయ్యేవి. అందుకే అంకేగౌడ తల్లిదండ్రులు కూడా ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్లమంటూ ఒత్తిడి చేస్తుండేవారు. గౌడ పరిస్థితి వేరు. కాస్త ముభావి.. ఒక రకంగా అంతర్ముఖుడు. అలాంటి నెమ్మదితనానికి పుస్తకపఠనం తోడైంది. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం పట్టుకుని ఊర్లో కనిపించేవాడు. డిగ్రీ పూర్తయ్యాక.. కన్నడలో ఎంఏ లిటరేచర్‌ చదువుకున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచీ సాహిత్యం అంటే మక్కువ. అందుకే అందులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ సులువుగా పూర్తి చేశాడు. ఒకవైపు చదువుతూనే పుస్తకాలను విరివిగా కొనుగోలు చేసేవాడు. అప్పటికే సగం ఇల్లు పుస్తకాలతో నిండిపోయింది.


book6.3.jpg

షుగర్‌ ఫ్యాక్టరీలో..

అంకేగౌడకు పుస్తకాలంటే ప్రాణమే కానీ, ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలంటే తిండి తినాలిగా!. కుటుంబం పూట గడవాలి. ఉపాధి తప్పనిసరి అని అర్థమైంది. పాండవపురలోని ఒక చక్కెర కర్మాగారంలో టైమ్‌ కీపర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇక తిండికి భయం లేదనుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నా పుస్తక ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. కాలికి బలపం కట్టుకుని తిరిగాడు. బెంగళూరు మహా నగరం దగ్గర కాబట్టి... తీరిక దొరికినప్పుడల్లా వెళ్లేవాడు. ‘‘ఇప్పుడంటే వయసు మీద పడింది కానీ.. ఒకప్పుడు ఆ సిటీకి ఎక్కువగా వెళ్లేవాణ్ణి. నగరంలోని మెజెస్టిక్‌, ఎంజీ రోడ్‌, అవెన్యూరోడ్‌లలో ఎక్కువగా పుస్తకాలు కొనేవాణ్ణి.


book6.4.jpg

వాటన్నిటినీ ఎంతో కష్టపడి మా ఇంటికి తీసుకొచ్చే వరకు మనసు కుదుటపడేది కాదు...’’ అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు అంకేగౌడ. అప్పటికైతే ఆయనకు పుస్తక భాండాగారం ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదు. పుస్తకాలను సేకరించడం అభిరుచిగా మారిందంతే!. ఏ ప్రాంతం వెళ్లినా కొత్త, పాత పుస్తకాలు అనే తేడాలేకుండా కొనేవాడు. ‘‘ఈ సందర్భంగా మరొకటి గుర్తు చేసుకోవాలి. నేను కాలేజీలో వున్నప్పుడు పుస్తకాలపైన ఇంత మక్కువ ఉండేది కాదు. మా అధ్యాపకులైన అనంతరాముడు గారు నాలో పఠనాభిలాషను పెంపొందించారు. జీవితంలో చదవడం ఎంత మానసిక బలాన్నిస్తుందో ఆయన మాటల ద్వారా అర్థమైంది. ఎవరి దగ్గరో ఉన్న పుస్తకాలను తీసుకుని చదవడం కన్నా మనమే సేకరిస్తే పోలా అనుకున్నాను. ముందుగా చౌకగా దొరికే పుస్తకాల మీద పడ్డాను. అప్పట్లో రామకృష్ణ మఠం ప్రచురించే మంచి పుస్తకాలు తక్కువ ధరల్లో దొరికేవి. వాటిని ఎడాపెడా కొనేశాను. చదవడం మొదలుపెట్టాను. అలా మెల్లమెల్లగా పుస్తకపఠనం వ్యసనంగా మారిపోయింది...’’ అంటూ వివరించాడు అంకేగౌడ.


book6.5.jpg

ముప్పావు జీతం వాటికే..

చక్కెర కార్మాగారంలో పెద్ద ఉద్యోగమేమీ కాదు. చిన్న నౌకరీనే!. ఆ జీతంతో కుటుంబం గడవడమే కష్టం. అయినా సరే.. వేతనంలో ముప్పావుశాతం పుస్తకాల కోసమే ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడు గౌడ. ఏ పట్టణం వెళ్లినా ఇంట్లో వాళ్లకు కొత్త బట్టలో, మిఠాయిలో, కనీసం పండ్లో తీసుకొస్తాడనుకుంటే పొరపాటు. ఆయన భుజంపై మోసుకొచ్చిన పెద్ద సంచి నిండా పుస్తకాలే ఉండేవి. కుటుంబ సభ్యులు కూడా ఆయన అభిరుచిని బాగా గౌరవించేవారు. ఒక సందర్భంలో అంకేగౌడ భార్య విజయలక్ష్మి ఇదే చెప్పుకొచ్చారు.. ‘‘మా ఆయన జీవిత లక్ష్యం స్పష్టం. ఏదో ఒక రోజు దేశం గర్వించదగ్గ అతి పెద్ద పుస్తక భాండాగారాన్ని భవిష్యత్తు తరాలకు ఇచ్చి వెళ్లాలన్నదే ఆయన తపన. నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాను.


నాకు నగలు లేవని, బ్యాంకులో నగదు లేదనీ ఏ రోజూ బాధ పడలేదు. ఈ రోజల్లో ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఆస్తిపాస్తులిచ్చి వెళ్లిపోతారు... కానీ మేము సమాజానికి పుస్తక వారసత్వ సంపదనిచ్చి వెళ్లిపోతాము. ఈ లక్షలాది పుస్తకాలు వేల మందికి సరికొత్త జీవనమార్గాన్ని చూపిస్తున్నాయి.. ఇంతకంటే ఏం కావాలి?’’ అంటుందా సతీమణి. ఇలా కొన్నేళ్లపాటు సేకరించిన పుస్తకాలతో కర్ణాటక రాష్ట్రం, మాండ్య జిల్లా, పాండవపుర తాలూకాలోని హరళహళ్లి (ఎన్‌ఎం రోడ్‌)లో అంకేగౌడ జ్ఞాన ప్రతిష్టాన బుక్‌ హౌస్‌ను ఏర్పాటు చేసిందీ కుటుంబం. వీరి అంకిత భావాన్ని చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీహరి ఖోడే యాభై లక్షల రూపాయలు ఖర్చుపెట్టి గ్రంథాలయాన్ని నిర్మించారు.


book6.6.jpg

దాదాపు 22 గుంటల విస్తీర్ణంలో భారీ భవనం వెలిసింది. అమూల్యమైన పుస్తకాలను భద్రపరచడానికి వంద ఇనుప బీరువాలను అందజేశారు ఖోడే. అంకేగౌడ 20 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇప్పటి వరకు (ప్రస్తుతం ఆయన వయసు 76) ఆయన సేకరించిన లక్షలాది పుస్తకాలన్నీ ఈ భవనంలో కొలువుతీరాయి. అంటే ఇంచుమించు ఆయన యాభై ఏళ్ల ప్రయాణంలో 15 లక్షల పుస్తకాలను సేకరించాడు. మన దేశంలో ఇన్నేసి పుస్తకాలను సేకరించిన మరో వ్యక్తి లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే లార్జెస్ట్‌ పర్సనల్‌ బుక్‌ కలెక్షన్‌ విభాగంలో అంకేగౌడ పేరును నమోదు చేసింది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌. ఇదొక్కటే కాదు.. రాజ్యోత్సవ అవార్డు, రాజారత్నం సాహిత్య పరిచారికా అవార్డు వంటివన్నీ ఆయనను వరించాయి.


అరుదైన పుస్తకాలెన్నో..

ఇంతకూ అంకేగౌడ గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి? ఎవరికి ఉపయోగపడతాయి? అన్నది ఆసక్తికరం. సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, శాస్త్ర విజ్ఞాన, తత్వశాస్త్ర, పరిశోధన, పర్యాటక గ్రంథాలెన్నో ఉన్నాయిక్కడ. ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌, ఎన్‌సైక్లోపీడియా, డిక్షనరీలు.. జాతీయ, అంతర్జాతీయ భాషల్లోని పుస్తకాలు కూడా కొలువుదీరాయి. 2500 వెర్షన్స్‌లో భగవద్గీత, వంద రకాల బైబిల్‌ పుస్తకాలను ఇక్కడ చూడొచ్చు. ఆయన వద్ద ఉన్న అరుదైన పుస్తకాల్లో ఒకటి షేక్స్‌పియర్‌ సంకలిత రచన. 1832 నాటి ఎనిమిది వాల్యూమ్స్‌ కలిగిన షేక్స్‌పియర్‌ పుస్తకాలు అంకేగౌడ లైబ్రరీలో పదిలంగా ఉన్నాయి. ఒక విదేశీ కొనుగోలుదారుడు 1.49 లక్షల డాలర్లు చెల్లిస్తాను.. ఆ షేక్స్‌పియర్‌ సంకలనాలు ఇచ్చేయమని బతిమాలినా ఇవ్వలేదు.


book6.7.jpg

35 వేల అంతర్జాతీయ పత్రికలు, 2500 కన్నడ మ్యాగజైన్లు, మరో 2500 గాంధీమహాత్మునిపై వచ్చిన పుస్తకాలు, 66 వేల వివిధ రకాల మ్యాగజైన్లు ఉన్నాయి. అంకేగౌడ గ్రంథాలయానికి ప్రతిరోజూ రెండొందల మంది అధ్యయనకారులు, పరిశోధకులు తరలివస్తుంటారు. ఈ లైబ్రరీలోని పుస్తకాలతోనే వందల మంది డాక్టరేట్లు పుచ్చుకున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. ఇలా అంకేగౌడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది కానీ.. ఆయన బాధలు మాత్రం చెప్పనలవి కానివి. ఒక చిన్న లైబ్రరీని నిర్వహించడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఒక రకంగా ప్రభుత్వాలకే చేతకావడం లేదు. అలాంటిది వయసు మీద పడిన అంకేగౌడకు ఎలా సాధ్యం? అదే ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతోంది. ఇన్నేసి పుస్తకాల లైబ్రరీని ఆయన కుటుంబమే రోజూ శుభ్రం చేస్తోంది. ఉద్యోగులు, సిబ్బంది లేరు. ఈ ప్రపంచం అంకేగౌడ గొప్పదనాన్ని ప్రశంసిస్తోంది కానీ.. ఆయన పోగుచేసిన సారస్వత వారసత్వానికి భద్రత కల్పించడం లేదు. అదే ఆయన బాధ!. ఇప్పుడు అంకేగౌడ గ్రంథాలయం కాలం చేతుల్లో ఉంది. వచ్చే తరం ఏమవుతుందో ఎవరికీ తెలియదు.

- సండే డెస్క్‌


పాత వస్తువుల్ని కూడా..

అంకేగౌడ కేవలం పుస్తక సేకరణకే పరిమితం కాలేదు. ఆయన కొన్నేళ్ల నుంచి అత్యంత అరుదైన పురాతన నాణేలు, కరెన్సీ నోట్లు, వస్తువులను సేకరిస్తూ వస్తున్నాడు. అందులో పాతకాలం నాటి అణాలు, పైసలు, రూపాయి, రెండు రూపాయల నోట్లు, ఇత్తడి నాణేలు ఉన్నాయి. ఇందులో వివిధ దేశాల కరెన్సీ నోట్లు ఉండటం విశేషం. పాత సినిమా పోస్టర్లను కూడా ఆయన భద్రపరిచారు. కొన్ని అమూల్యమైన స్టాంప్స్‌ కూడా ఉన్నాయక్కడ. అంకేగౌడకు పురాతన వస్తువులంటే పాతబడిన, పనికిరానివి కావు. అవన్నీ గత స్మృతులు. మన పూర్వీకుల జ్ఞాపకాలు. వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు అన్నది ఆయన భావన. అందుకే తను ఏ ఊరు వెళ్లినా పాత వస్తువులు కనిపిస్తే చాలు.. భావోద్వేగానికి లోనై వెంటనే తీసుకొస్తాడు. అలా ఆయన దగ్గరున్న వాటిలో తనకు ఇష్టమైనవి పాత టెలిఫోన్లు, పాత టైపు రైటర్లు. వీటితో పాటు ఏళ్ల కిందట విడుదల చేసిన గెజిట్లు కూడా ఉన్నాయి. ఇక, కొన్ని పత్రికల తొలి ఎడిషన్లను సైతం గౌడ లైబ్రరీలో చూడొచ్చు. వీటితోపాటు అనేకభాషల్లో వచ్చిన రకరకాల వెర్షన్ల భారత, రామాయణ పుస్తకాలు ఈ లైబ్రరీ ప్రత్యేకం.


book6.8.jpg

- అమెరికా వ్యవస్థాపక పితామహునిగా పేరుగాంచిన బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ 1731లోనే లెండింగ్‌ లైబ్రరీని నెలకొల్పాడు. పుస్తకాలను అరువుగా తీసుకెళ్లే ప్రక్రియ ఆయన నుంచే మొదలైంది.

- సామాజిక సేవకు మారుపేరైన ఆండ్రూ కార్నెగి కేవలం గ్రంథాలయాల కోసమే ప్రత్యేక నిధిని కేటాయించాడు. 1886-1919 వరకు వందల కోట్ల రూపాయలతో లైబ్రరీలను నెలకొల్పడం విశేషం. ఆయన అందించిన నిధులతో ఏర్పాటైన 2,509 లైబ్రరీలు ఇప్పటికీ నడుస్తున్నాయి. అందులో ఒక్క అమెరికాలోనే 1679 ఉండటం విశేషం.

- లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం. ఇందులో సుమారు 17 కోట్ల పుస్తకాలు, వస్తువుల్ని భద్రపరిచారు. పాత మ్యాగజైన్లను కూడా తిరిగి ముద్రిస్తుందీ లైబ్రరీ.


- పుస్తకం దుమ్ము పడితే ప్రమాదం. ఆ ధూళి తేమను గ్రహించి పుస్తకాలన్నిటినీ దెబ్బతీస్తుంది. అందుకే బోస్టన్‌ పబ్లిక్‌ లైబ్రరీలో పుస్తకాలను శుభ్రం చేయడానికే డెపుల్వెరా అనే యంత్రాన్ని ఏర్పాటు చేశారు.

- డబ్లిన్‌ (ఐర్లాండ్‌)లోని మార్ష్‌ లైబ్రరీకి 18వ శతాబ్దంలో ఒక ప్రత్యేకత ఉండేది. అరుదైన పుస్తకాలను చదివే పాఠకులను బోనులో బందించడం ఆ ప్రత్యేకత. చదవడం అయ్యాక వదిలేసేవారట!.

- ఫిన్లాండ్‌ ప్రజలు కరవొకె ప్రియులు. అందుకే వాంటాలోని టిక్కురిలా లైబ్రరీలో కరవొకెను ఏర్పాటు చేసేవారు. అయితే ఆ గదులన్నీ శబ్దరహితం కాబట్టి.. గ్రంథాలయ పాఠకులకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు.

- ఒకప్పుడు న్యూయార్క్‌ పబ్లిక్‌లైబ్రరీలో పుస్తకాలనే కాదు.. బ్రీఫ్‌కేస్‌, మెడకు కట్టుకునే టైలను సైతం అద్దెకు అందించేవారు. చాలామంది వాటి సహాయంతో ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరై.. తిరిగి వాటిని లైబ్రరీకి అప్పగించేవారు.


- భారత్‌లో గ్రంథాలయ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేశారు కానీ అమెరికా మాత్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ దేశంలోని లైబ్రరీల్లో.. 1,64,280 మంది గ్రంథాలయపాలకులు (లైబ్రేరియన్లు), 38,380 మంది సాంకేతిక నిపుణులు, 79, 840 మంది లైబ్రరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఇవన్నీ 2022 నాటి లెక్కలు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగింది.

- బిహార్‌లోని నలంద, విక్రమశిల అత్యంత ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయాలు. ఇక్కడున్న గ్రంథాలయాల్లోని పుస్తకాల కోసం చైనా యాత్రికుడైన ఫా-హియాన్‌తో సహా అనేక మంది పండితులు తరలి వచ్చారు. అదీ ఒకప్పటి మన భారతీయ గ్రంథాలయ ఔన్నత్యం.


- తంజావూరులోని సరస్వతీ మహిళా గ్రంథాలయానికి ఎంతో పేరుంది. ఇక్కడ వివిధ భారతీయ భాషలకు చెందిన, అత్యంత పురాతనమైన, విలువైన తాళపత్రగ్రంథాలు ఉన్నాయి.

- అందరిలాగే విజ్ఞానమే దైవమని విశ్వసిస్తారు రాజస్థానీయులు. జైసల్మేర్‌లోని భూగర్భంలో ‘బదారియా గ్రంథాలయా’న్ని ఏర్పాటు చేసుకున్నారు. అరుదైన లైబ్రరీల్లో ఇదొకటి.

- పన్నెండవ శతాబ్దం చివరలో సుల్తాన్‌ జలాలుద్దీన్‌ ఖిల్జీ ఢిల్లీలో ఒక ఇంపీరియల్‌ లైబ్రరీని నెలకొల్పాడు. దానికి లైబ్రేరియన్‌ ప్రసిద్ధ కవి అమీర్‌ ఖుస్రు.

- అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న అవోకాకు చెందిన జాన్‌ క్యు బెన్‌హామ్‌ అత్యధిక పుస్తకాల సేకరణకర్తగా రికార్డులకెక్కాడు. ఆయన వద్ద పదిహేను లక్షల పుస్తకాలున్నాయి. ఆరు కార్ల గ్యారేజీలతో పాటు రెండంతస్థుల భవనం నిండా పుస్తకాలే!.


- మానవవికాస చరిత్రలో అత్యధికంగా పంపిణీ చేసిన, అమ్ముడైన పవిత్రగ్రంథం బైబిల్‌. ఇప్పటికీ ఈ గ్రంథ అమ్మకాలను మరొక పుస్తకం అధిగమించలేదు. బైబిల్‌ తర్వాత మావో పుస్తకాలు, హారీపోటర్‌ సిరీస్‌ బుక్స్‌ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయట.

ఎలా వెళ్లాలి?

అంకేగౌడ పుస్తక నిలయానికి చేరుకోవడం సులభం. బెంగళూరు నుంచి పాండవపురకు రైలులో అయితే రెండు గంటల ప్రయాణం. అక్కడి నుంచి ఒక కి.మీ. దూరంలోనే ఉంటుంది హరళహళ్లి. రవాణా సదుపాయం ఇబ్బంది లేదు కాబట్టి.. ప్రతి రోజూ చాలా మంది పుస్తకప్రియులు అంకేగౌడ లైబ్రరీకి వెళుతుంటారు. ముఖ్యంగా కవులు, కళాకారులు, ప్రగతిశీలవాదులు, మేధావులు, అధ్యాపకులు, పరిశోధకులు, పాఠకులు తరచూ వెళ్లి.. ఆయన్ని పలకరిస్తుంటారు. కొందరైతే అంకేగౌడ పుస్తక యజ్ఞాన్ని అభినందిస్తూ సన్మానాలు సైతం చేసి వస్తున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 10:42 AM