Mayoral Elections 2025: న్యూయార్క్ మేయర్ పోటీలో జోహ్రాన్ మమ్దానీ
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:52 AM
అమెరికాలోని కీలకమైన నగరం న్యూయార్క్ మేయర్ పదవికి భారత సంతతి మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ పోటీపడుతున్నారు. డెమోక్రాట్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు.
డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక
ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు
తండ్రి గుజరాతీ మూలాలున్న ఉగాండా ముస్లిం
జోహ్రాన్ కమ్యూనిస్టు పిచ్చివాడంటూ ట్రంప్ విమర్శలు
న్యూయార్క్, జూన్ 26: అమెరికాలోని కీలకమైన నగరం న్యూయార్క్ మేయర్ పదవికి భారత సంతతి మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ పోటీపడుతున్నారు. డెమోక్రాట్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు. 33 ఏళ్ల వయసున్న జోహ్రాన్ తల్లి అమెరికాలో స్థిరపడిన భారతీయురాలు, సినీ నిర్మాత మీరా నాయర్. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ గుజరాతీ మూలాలున్న ఉగాండా జాతీయుడు. ఆఫ్రికా ఖండంలో వలస పాలన, రాజకీయ హింసపై ఎన్నో రచనలు చేశారు. ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ‘గుడ్ ముస్లిం.. బ్యాడ్ ముస్లిం’ పుస్తకం రాశారు. జోహ్రాన్ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయనకు ఏడేళ్ల వయసున్నపుడు వారి కుటుంబం న్యూయార్క్‌కు వలస వచ్చింది. అక్కడే చదువు పూర్తి చేసిన జోహ్రాన్.. క్రమంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2021లో క్వీన్స్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజా గా న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలో డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు తేల్చాయి. ఈ క్రమంలో జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘జోహ్రాన్ కమ్యూనిస్టు పిచ్చివాడు. ఇంతకుముందు రాడికల్ వామపక్షవాదులను చూశాం. కానీ ఇతను మరీ దారుణంగా ఉన్నాడు. అతడి గొంతు ఘోరంగా ఉంది. అంత తెలివైనవాడు కూడా కాదు’’ అని విమర్శించారు. డెమోక్రాట్ల తరఫున మేయర్ అభ్యర్థిత్వానికి పోటీపడిన సమయంలో జోహ్రాన్ కూడా ట్రంప్‌పై గట్టిగానే విమర్శలు గుప్పించారు.