Share News

Youth Movement: నిరుడు బంగ్లా.. నేడు నేపాల్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:54 AM

అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక అవకతవకలు, అసమర్థ పాలన భారత ఉపఖండంలోని కొన్ని దేశాలకు శాపంగా మారుతున్నాయి. ..

Youth Movement: నిరుడు బంగ్లా.. నేడు నేపాల్‌

  • ఉద్యమాల ఉధృతికి ‘పొరుగు’ నేతలు పతనం!

అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక అవకతవకలు, అసమర్థ పాలన భారత ఉపఖండంలోని కొన్ని దేశాలకు శాపంగా మారుతున్నాయి. వీటిని సహించలేని యువత ఉద్యమోన్ముఖులై.. ప్రత్యక్ష కార్యాచరణకు దిగడంతో రెండు దేశాల ప్రధానులు పదవీచ్యుతులయ్యారు. గత ఏడాది బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఈ ఉద్యమానికి బలి కాగా.. ఈసారి వంతు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలిది. హసీనా భారత్‌లో ఆశ్రయం సంపాదించగా.. ఓలి దుబాయ్‌ వెళ్తున్నట్లు సమాచారం. 2022లో శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయ రాజపక్ష, ఆయన అన్న-ప్రధాని మహీంద రాజపక్షను ఆందోళనకారులు తరిమికొట్టిన సంగతి తెలిసిందే. నేపాల్‌, బంగ్లాల్లో సంభవించిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో సారూప్యతలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి మూలకారణం.. తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీలపై.. పాక్‌ పంజాబీల ఆధిపత్యం. రాజకీయంగా, ఉద్యోగపరంగానే గాక భాష, సాంస్కృతికపరంగానూ బెంగాలీలను అణచివేసేందుకు పాక్‌ పాలకులు చేసిన ప్రయత్నాలతో.. బెంగాలీల ఉద్యమం పతాక స్థాయికి చేరి.. బంగ్లాదేశ్‌ ఏర్పాటుకు దారితీసింది. ఈ ఉద్యమానికి అవామీలీగ్‌ పార్టీ నాయకత్వం వహించింది. 50 ఏళ్ల తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. అదే అవామీలీగ్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న షేక్‌ హసీనాను ఉద్యమకారులు పదవీచ్యుతురాలిని చేశారు. ఆమె సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. ఆమెను తొలగించాలంటూ విద్యార్థులు రోడ్లెక్కారు. ఒకప్పుడు విప్లవాన్ని ముందుండి నడిపిన పార్టీ.. మరో విప్లవం కారణంగా రాజకీయంగా తెరమరుగైంది.

ఓలీ గతంలో సఫలం.. ఇప్పుడు విఫలం

నేపాల్లో రాడికల్‌ వామపక్షవాదులు రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు. 2008 మేలో రాచరిక పాలనను రద్దుచేశారు కూడా. ఆ రద్దుచేసిన సంకీర్ణ ప్రభుత్వంలో కేపీ శర్మ ఓలికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యునిఫైడ్‌ మార్క్సి్‌స్ట-లెనినిస్ట్‌) కూడా భాగస్వామి. ప్రజాస్వామ్య విధానానికి మారినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇటీవలి కాలంలో తిరిగి రాచరిక పాలన రావాలని నేపాల్‌ సమాజంలోని ఓ వర్గం కోరుతోంది. ఆ మధ్య రోడ్డెక్కి భారీఎత్తున ఉద్యమించింది కూడా. దానిని అణచివేయడంలో ఓలి సఫలమయ్యారు. కానీ ఇప్పుడు తన ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ‘జెన్‌-జడ్‌’ చేపట్టిన ఉద్యమ ధాటికి ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది.


బంగ్లాదేశ్‌లో అణచివేతపై ప్రతిఘటన

బంగ్లా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న సమరయోధుల సంతానానికి ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించడంపై బంగ్లాదేశ్‌లో యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనివల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఆందోళన వారిలో ఉంది. ఈ రిజర్వేషన్లను వాస్తవానికి హసీనా ప్రభుత్వం 2018లోనే తొలగించింది. కానీ గత ఏడాది జూన్‌లో దిగువ కోర్టు ఆ కోటాలను పునరుద్ధరించింది. దానిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అన్ని రకాల రిజర్వేషన్‌ను 93 శాతానికే పరిమితం చేసింది. అయితే దిగువ కోర్టు నిర్ణయంతో అప్పటికే యువత ఉద్యమబాట పట్టారు. రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా బంగ్లా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించినా.. ఉద్యమం ఉధృత రూపం దాల్చింది, హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణచివేయాలని చూసింది. 1,500 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయినా యువత వెనుదీయలేదు.

నేపాల్‌లో అవినీతి, బంధుప్రీతి..

నేపాల్లో రాజకీయ నేతలు, అధికారుల సంతానం, బంధుమిత్రులకే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతుండగా.. మిగతా సాధారణ యువత మాత్రం నిరుద్యోగంలో మగ్గుతోంది. దీనిపై ‘నెపోకిడ్స్‌’ హ్యాష్‌టాగ్‌తో ఆందోళనకారులు నిరసనలు మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఓలి ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై యువత రోడ్డెక్కారు. వారిని అణచివేసేందుకు భద్రతాబలగాలు కాల్పులు, బాష్పవాయు ప్రయోగం చేశాయి. 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం ఎత్తివేసినా.. ప్రాణనష్టం చూసిన యువత ‘జెన్‌-జడ్‌’ పేరిట ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. నేతల అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాటం పెంచారు. ఫలితంగా ఓలీ రాజీనామా చేశారు.

Updated Date - Sep 10 , 2025 | 03:54 AM