Share News

US Vice President JD Vance: నా భార్యను తూలనాడేవారు పేడ తిన్నట్టే!

ABN , Publish Date - Dec 24 , 2025 | 04:12 AM

తన భార్య ఉషను తూలనాడేవారు పేడ తిన్నట్టేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

US Vice President JD Vance: నా భార్యను తూలనాడేవారు పేడ తిన్నట్టే!

  • అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ ధ్వజం

  • జాతి వివక్ష ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య

వాషింగ్టన్‌, డిసెంబరు 23: తన భార్య ఉషను తూలనాడేవారు పేడ తిన్నట్టేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ అమెరికన్‌వాదులు జాతి మూలాలపై అతిగా దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. ఉషను లక్ష్యంగా చేసుకొని అతివాద వ్యాఖ్యాత నిక్‌ ఫ్యూన్టెస్‌, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ భారత వ్యతిరేక, యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో జేడీ వాన్స్‌ ఈ విధంగా ప్రతిస్పందించారు. ఒక బ్రిటిష్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్‌ మాట్లాడుతూ ‘నా భార్యను విమర్శించేవారు ఎవరైనా సరే.. వారి పేర్లు సాకీ, నిక్‌ అయినాసరే.. వారు పేడ తిన్నట్టే. అమెరికా ఉపాధ్యక్షుడిగా నా అధికారిక విధానం ఇదే’ అన్నారు. ప్రత్యేకించి సంప్రదాయవాద ఉద్యమంలో యూదు వ్యతిరేకత, జాతి వివక్ష అన్ని రూపాల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. నల్లగా ఉన్నారని, లేదా తెల్లగా ఉన్నారని, లేదా వారు యూదులనే కారణంతో విమర్శించడం రోతగా ఉంటుందన్నారు. కాగా, భారత్‌ నుంచి వలసవచ్చిన దంపతులకు ఉషా వ్యాన్స్‌ జన్మించారు. దీంతో ఉషా లక్ష్యంగా నిక్‌ తరచుగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు.

Updated Date - Dec 24 , 2025 | 04:12 AM