US Student Visa: భారత విద్యార్థులకు అమెరికా మొండిచెయ్యి!
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:29 AM
విదేశీ విద్యార్థులకు అమెరికా జారీ చేసే వీసాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా దాదాపు ఐదో వంతు తక్కువ విద్యార్థి వీసాలను జారీ ....
గత ఏడాది కంటే 44.5% తక్కువ వీసాలు జారీ
ఫ్రాన్స్ వెళ్లే భారత విద్యార్థుల్లో 17ు పెరుగుదల
న్యూఢిల్లీ, అక్టోబరు 7: విదేశీ విద్యార్థులకు అమెరికా జారీ చేసే వీసాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా దాదాపు ఐదో వంతు తక్కువ విద్యార్థి వీసాలను జారీ చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని ప్రభావంతో అక్కడికెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాధారణంగా అమెరికాలో యూనివర్సిటీలు ఆగస్టులో ప్రారంభమవుతాయి. ఈ నెలకు గాను ట్రంప్ యంత్రాంగం 3,13,138 విద్యార్థి వీసాలను జారీ చేసింది. 2024 ఆగస్టుతో పోలిస్తే ఇది 19.1ు తక్కువని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ పేర్కొంది. గత ఏడాది అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో భారత్ టాప్‌లో నిలిచింది. గత ఆగస్టుతో పోలిస్తే భారతీయులకు ఈసారి ఏకంగా 44.5ు తక్కువ వీసాలు జారీ చేయడంతో మన దేశ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల కంటే రెట్టింపు సంఖ్యలో చైనీయులకు 86,647 వీసాలు జారీ అయ్యాయి. మరోవైపు ఇరాన్ నుంచి కూడా ప్రవేశాలు 86ు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. వందలాది మంది విద్యార్థుల వీసాలు రద్దు చేయడం, వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను నిలిపివేయడం, ఆంక్షలు, అరెస్టులు, సోషల్ మీడియా వెట్టింగ్, హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచడం వంటి చర్యలతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీలో ‘చూజ్ ఫ్రాన్స్ టూర్-2025’
2024-25 సంవత్సరానికి గాను ఫ్రాన్స్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులు 17ు పెరిగారు. 2030 నాటికి వీరి సంఖ్యను 30వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. తమ దేశంలో ఉన్నత విద్యావ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలకు అవగాహన కల్పించేందుకు ‘చూజ్ ఫ్రాన్స్ టూర్-2025’ పేరిట మంగళవారం ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించింది. అక్టోబరు 5న చెన్నైలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 9న కోల్‌కతాలో, 11న ముంబైలో నిర్వహించనున్నారు. ఫ్రాన్స్‌లోని అగ్రశ్రేణి వర్సిటీలతో పాటు ఇంజనీరింగ్, బిజినెస్, ఆర్ట్స్ విభాగాల్లోని 50కి పైగా ప్రముఖ విద్యాసంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.