Share News

Visa Reform: హెచ్‌-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు వద్దు

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:18 AM

హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది.

 Visa Reform: హెచ్‌-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు వద్దు

  • ట్రంప్‌నకు అమెరికా చట్టసభ సభ్యుల బృందం లేఖ

న్యూఢిల్లీ, అక్టోబరు 23: హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ అధికార రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీలకు చెందిన ఏడుగురు చట్టసభ సభ్యుల బృందం ఆయనకు లేఖ రాసింది. పెంచిన ఫీజు కారణంగా చిన్న కంపెనీలతో పాటు స్టార్ట్‌పలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, ఆవిష్కరణలకు ఆటంకం ఏర్పడుతుందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న హెచ్‌-1బీ వీసా విధానంలో మార్పులు అవసరమని తాము కూడా అంగీకరిస్తున్నామని, అయితే ఫీజు పెంపు నిర్ణయం కంపెనీల యాజమాన్యాలకు గణనీయమైన సవాళ్లను సృష్టించడంతో పాటు అమెరికా పోటీ తత్వాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను దేశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకొనే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, వీసా అర్హతల్లో మార్పులు తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీజులు పెంచడానికి బదులుగా ఈ వ్యవస్థను సరిదిద్దడానికి కాంగ్రెస్‌తో కలసి పనిచేయాలని అధ్యక్షుడిని కోరారు. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌లో సమస్యలను పరిష్కరించడానికి గల మార్గాలపై తమతో చర్చలు జరపాలని ట్రంప్‌తో పాటు వాణిజ్య మంత్రి లుట్నిక్‌ను సభ్యుల బృందం అభ్యర్థించింది.

Updated Date - Oct 24 , 2025 | 06:19 AM