Share News

Trump Immigration Policy: పుట్టుకతో సంక్రమించే పౌరసత్వాన్ని రద్దుచేయలేరు

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:44 AM

దేశంలో అక్రమంగా ఉంటున్న, లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మించే పిల్లలకు పుట్టుకతో సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేయలేరని...

Trump Immigration Policy: పుట్టుకతో సంక్రమించే పౌరసత్వాన్ని రద్దుచేయలేరు

  • ట్రంప్‌ సర్కారుకు తేల్చి చెప్పిన ఫెడరల్‌ అప్పీళ్ల కోర్టు

బోస్టన్‌/సియాటెల్‌, అక్టోబరు 4: దేశంలో అక్రమంగా ఉంటున్న, లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మించే పిల్లలకు పుట్టుకతో సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేయలేరని బోస్టన్‌లోని ఒక ఫెడరల్‌ అప్పీళ్ల కోర్టు ట్రంప్‌ సర్కారుకు తేల్చి చెప్పింది. ఫస్ట్‌ యూఎస్‌ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌కు చెందిన ముగ్గురు జడ్జీల ప్యానల్‌ శుక్రవారం ఈ మేరకు రూలింగ్‌ ఇచ్చింది. ట్రంప్‌ ఆదేశాన్ని నిలిపివేస్తూ, అలాగే ఆ ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు అనుమతిస్తూ కింది కోర్టు జారీ చేసిన ప్రిలిమినరీ ఇంజక్షన్‌ ఆర్డర్‌ను జడ్జీల ప్యానల్‌ సమర్థించింది. దీంతో ఈ అంశంపై ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలకు చట్టపరంగా అవరోధాలు పెరిగినట్టైంది. ఈ అంశంపై ట్రంప్‌ ఆదేశాలను అడ్డుకున్న 5వ ఫెడరల్‌ కోర్టు ఇది. జనవరిలో ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ వివాదాస్పద ఆదేశంపై సంతకం చేశారు. అమెరికాలో అక్రమంగా, లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మించే పిల్లలకు ఆటోమేటిక్‌గా సంక్రమించే పౌరసత్వ హక్కును నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.

హెచ్‌1బీ వీసా ఫీజు పెంపును అడ్డుకోండి..

హెచ్‌1బీ వీసా ఫీజును రూ.88 లక్షలకు పెంచాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలైంది. ట్రంప్‌ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ వైద్య సిబ్బంది, మత సంస్థల నాయకులు, ప్రొఫెసర్లు సంయుక్తంగా శుక్రవారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ డిస్ర్టిక్ట్‌ కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘ట్రంప్‌ నిర్ణయాన్ని అడ్డుకోకపోతే ఆస్పత్రులు వైద్య సిబ్బందిని, తరగతి గదులు టీచర్లను కోల్పోతాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలు కీలక ఆవిష్కర్తలను కోల్పోయే ముప్పు పొంచి ఉంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 03:44 AM