Share News

US Restrictions: ఐటీ ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షలు

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:46 AM

భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించినా దిగిరావట్లేదన్న అక్కసుతో.. అమెరికన్‌ కంపెనీలకు భారత కంపెనీల ఐటీ ఔట్‌సోర్సింగ్‌ సేవలను అడ్డుకునేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

US Restrictions: ఐటీ ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షలు

  • భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా

  • డొనాల్డ్‌ ట్రంప్‌ పరిశీలనలో ప్రతిపాదన

  • ఆయన సలహాదారు లారా లూమర్‌ పోస్ట్‌

  • ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో భారత్‌ చర్చలు

  • ఎలకా్ట్రనిక్స్‌, తయారీ రంగానికి ఊతం

  • కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

న్యూయార్క్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించినా దిగిరావట్లేదన్న అక్కసుతో.. అమెరికన్‌ కంపెనీలకు భారత కంపెనీల ఐటీ ఔట్‌సోర్సింగ్‌ సేవలను అడ్డుకునేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాకు చెందిన మితవాద ఉద్యమకారుడు జాక్‌ పోసోబిక్‌ నాలుగు రోజుల క్రితమే ఈ ప్రతిపాదనతో ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దాన్ని ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో రీపోస్ట్‌ చేశారు! తాజాగా.. ట్రంప్‌ సలహాదారు, మితవాద ఉద్యమకారిణి లారా లూమర్‌ కూడా ‘ఎక్స్‌’లో ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. ‘‘అమెరికన్‌ ఐటీ సంస్థలు తమ పనిని భారతీయ సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వకుండా అడ్డుకునే అంశాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ పరిశీలిస్తున్నారు. ఇకపై మీరు (అమెరికన్లు) ఇంగ్లిష్‌ కోసం రెండు నొక్కాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు. మేక్‌ కాల్‌సెంటర్స్‌ అమెరికన్‌ ఎగైన్‌’’ అని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ కోసం రెండు నొక్కితే.. మాట్లాడే వ్యక్తి నిజంగా ఇంగ్లిష్‌ మాట్లాడే వ్యక్తి కాకపోవడం ఇక ఆగిపోతుందని, అలాంటి రోజులకు ట్రంప్‌ ముగింపు పలుకుతారని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా అమెరికన్లు ఏదైనా కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసినప్పుడు.. ‘స్పానిష్‌ కోసం ఒకటి నొక్కండి.. ఇంగ్లిష్‌ కోసం రెండు నొక్కండి’ అనే యాంత్రిక స్వరం వినిపిస్తుంటుంది. ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షలు విధిస్తే అప్పుడు కాల్‌సెంటర్‌ ఉద్యోగాలన్నీ అమెరికన్లకే వస్తాయని.. అప్పుడు వారంతా సహజమైన అమెరికన్‌ యాసలో మాట్లాడతారని ఆమె ఉద్దేశం.


ట్రంప్‌ నిజంగానే భారత కంపెనీలకు ఐటీ ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షల ప్రతిపాదనను పరిశీలిస్తున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదుగానీ... ఐటీ రంగానికి సంబంధించి ఆయన పెద్ద నిర్ణయమే తీసుకోనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. దాదాపురూ.26,45 లక్షల కోట్లు విలువైన టెక్‌ పరిశ్రమను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ సంస్థలతో, విదేశీ ప్రభుత్వాలతో భారత్‌ చర్చలు జరుపుతోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. భారత్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాలను నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్టు ‘మనీ కంట్రోల్‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. అలాగే.. అమెరికా, యూరప్‌, జపాన్‌, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. అయితే.. భారత్‌ పూర్తిగా సేవల ఎగుమతులపై ఆధారపడి లేదన్న అశ్వినీ వైష్ణవ్‌.. ఐటీ సేవలపై ఆంక్షల వల్ల వచ్చే నష్టాన్ని ఎలకా్ట్రనిక్స్‌, తయారీ రంగానికి ఊతం ఇవ్వడం ద్వారా పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Sep 08 , 2025 | 03:48 AM