హార్ముజ్ జలసంధిలో రెండు నౌకల ఢీ
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:38 AM
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ జలసందిని మూసేసే యోచనలో ఇరాన్ ఉన్న సంగతి తెలిసిందే.

గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి చమురు చేరవేతలో కీలక రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిలో.. మంగళవారం రెండు నౌకలు పరస్పరం ఢీకొని తగలబడిపోయాయి! ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ జలసందిని మూసేసే యోచనలో ఇరాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్త సమయంలో ఆ జలసంధిలో రెండు నౌకలు తగలబడిపోతున్నాయన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే.. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి భద్రతాపరమైన కారణాలూ లేవని, నౌకల ఎలకా్ట్రనిక్ సంకేతాలకు అంతరాయం కలగడం వల్లే ఒకదాన్నొకటి ఢీకొన్నాయని బ్రిటిష్ మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ అంబ్రే తెలిపింది. ఈ నౌకల్లో ఒకటి ఫ్రంట్‌లైన్ ఈగిల్ ట్యాంకర్ కాగా.. రెండోది అడలిన్ ట్యాంకర్. ఫ్రంట్‌లైన్ ఈగిల్ ట్యాంకర్ ఇరాక్ నుంచి చైనాలోని ఝౌషాన్‌కు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక, అడలిన్ నౌక.. భారతదేశంలోని గ్లోబల్ షిప్పింగ్ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందినది. ఈ నౌకలో ఉన్న 24 మందినీ కాపాడినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీర రక్షకదళం ప్రకటించింది.
ఇజ్రాయెల్‌కూ భారీ నష్టం
ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లో కూడా భారీ నష్టం జరుగుతోంది. హైఫా వద్ద ఉన్న బజాన్ చమురు రిఫైనరీపై సోమవారం దాడులు జరిగిన విషయం తెలిసిందే..! ఈ దాడుల్లో ప్రధాన ప్లాంట్‌కు నష్టం వాటిల్లకున్నా.. ఆవరణలో పార్క్ చేసిన భారీ ఆయిల్ ట్యాంకర్ ట్రక్కులు దహనమయ్యాయి. టెల్‌అవీవ్ శివార్లలోని రామత్ హషరోన్ పట్టణంలోనూ ఇరాన్ దాడులతో ఆవాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. గ్లిలోట్‌లోని అమన్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఇరాన్ క్షిపణులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి. ఐడీఎఫ్ ఈ వార్తలను ఖండించింది. ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నామని వివరించింది. ‘‘ఇరాన్ దాడులను ఇలాగే కొనసాగిస్తే.. ఖమేనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు.