Donald Trump: ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:38 AM
ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వల్ల వాణిజ్య యుద్ధం ముదిరింది. చైనా భారత మద్దతు కోరగా, అమెరికా-చైనా మధ్య సుంకాల పెంపుతో గ్లోబల్ మార్కెట్లు హల్‌చల్ చేశాయి.

చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన
అప్పటిదాకా 10 శాతమే వసూలు చేస్తామని వెల్లడి
తమపై చైనా విధించిన 84ు సుంకానికి ప్రతిగా..
ఆ దేశంపై టారిఫ్ 125 శాతానికి పెంచేస్తూ నిర్ణయం
ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు
సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు
పలుదేశాల నేతలు తహతహలాడుతున్నారని వ్యాఖ్య
ప్లీజ్ సర్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్నారని వెల్లడి
ఆ నేతలపై అసభ్యకరమైన భాషలో నీచమైన వ్యాఖ్య
మా కార్లపై దిగుమతి సుంకాన్ని సున్నాకు తగ్గించండి
భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి
కనీసం 30 శాతం ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు
అమెరికాపై 25ు సుంకాల విధింపునకు ఈయూ సై
కలిసి పనిచేద్దాం.. భారత్‌కు చైనా ప్రతిపాదన!
బీజింగ్, వాషింగ్టన్, ఏప్రిల్ 9: అమెరికా ప్రతీకార సుంకాల బాదుడు నేపథ్యంలో ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. తన సూచన మేరకు అమెరికాపై ఎలాంటి ప్రతీకార సుంకాలూ విధించని 75కుపైగా దేశాలకు.. సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ 90 రోజులూ ఆయా దేశాల ఉత్పత్తులపై నామమాత్రంగా 10 శాతం దిగుమతి సుంకాలను వసూలు చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు బుధవారం ఉదయం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ట్రంప్ నిర్ణయంతో అది వాయిదా పడినట్టయింది. అదే సమయంలో.. ఢీ అంటే ఢీ అంటూ తమకు పోటీగా సుంకాలను విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు! అమెరికా తమపై సుంకాల భారాన్ని 104 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. చైనా కూడా అమెరికాపై సుంకాలను 84 శాతానికి పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దీంతో అంకుల్‌శామ్ (అమెరికా అధ్యక్షుడు) మరింత రెచ్చిపోయారు. ప్రపంచ మార్కెట్ల పట్ల ఏమాత్రం మర్యాద చూపని డ్రాగన్ దేశంపై.. సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్టు తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. మిగతా దేశాల్లాగా 90 రోజుల వెసులుబాటు కూడా ఇవ్వకుండా.. ఆ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పోస్టులో ట్రంప్ తేల్చిచెప్పారు. అమెరికాను, ఇతర దేశాలను సుంకాల పేరుతో దోచుకోవడం ఇకపై ఎంతమాత్రం కుదరదనే నిజాన్ని చైనా త్వరలోనే తెలుసుకుంటుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అంతకుముందు.. అమెరికాపై 84 శాతం సుంకాలను విధిస్తూ తీసుకున్న నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చైనా ప్రకటించింది. సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా మార్కెట్లు దూసుకుపోయాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 8.5 శాతం పెరగ్గా.. డౌజోన్స్ సూచీ 7.2ు, నాస్‌డాక్ 10.8ు మేర పెరిగాయి. 2020 నుంచి మార్కెట్లు ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.
అంతేకాదు.. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాకు వ్యతిరేకంగా మరో దావా వేయబోతున్నట్టు వెల్లడించింది. చైనా కంపెనీలతో వ్యాపారం చేసే అమెరికన్ కంపెనీలపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఇలా చాలా కంపెనీలపై ఆంక్షలు విధించిన చైనా.. తాజాగా 11 కంపెనీలను ఆ జాబితాలో చేర్చింది. సుంకాలను పెంచడం అమెరికా సమస్యలను పరిష్కరించదని చరిత్ర, గణాంకాలు చెబుతున్నాయని పేర్కొంది. అమెరికా చర్యలు ఆ దేశానికే ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించింది. సుంకాల పేరుతో అమెరికా తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని.. కానీ, అలాంటి ఆధిపత్య చర్యలను తాము ఎన్నటికీ అంగీకరించబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. తమ దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు, అభివృద్ధి ఆకాంక్షలకు విఘాతం కలిగించే ఎటువంటి ప్రయత్నాలనూ తాము సహించబోమని.. అమెరికాపై దృఢమైన, శక్తిమంతమైన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు.. యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం అమెరికాపై 25 శాతం సుంకాల విధింపు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటువేశాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 16, డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది.
కలిసి పనిచేద్దాం.. డ్రాగన్ ప్రతిపాదన!
అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్ దేశం భారతదేశ మద్దతును కోరింది. అమెరికా సుంకాల వేధింపులను ఎదుర్కోవడానికి, కష్టాలను అధిగమించడానికి రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు (భారత్, చైనా) కలిసి నిలబడాలని భారత్‌లో చైనా దౌత్యకార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ ‘ఎక్స్’లో పెట్టిన ఒక పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. అమెరికా అనుసరిస్తున్న సుంకాల వేధింపుల కారణంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోతున్నాయని, ఆవేదన వెలిబుచ్చిన యు జింగ్.. వాణిజ్య, సుంకాల యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని హెచ్చరించారు. సంరక్షణ వాదం, ఏకపక్ష వాదం ఏ రూపంలో ఉన్నా వాటిని ప్రపంచదేశాలన్నీ కలిసి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం.. ఇండియా, చైనా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఏప్రిల్ 1న బీజింగ్‌లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య సంబంధాలు ‘ఏనుగు-డ్రాగన్ నృత్యం’లా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలోనే అయినప్పటికీ.. చైనాలో అత్యున్నత స్థాయి నేత నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం చెప్పుకోదగ్గ విషయమే. చైనా విదేశాంగ మంత్రి కూడా.. న్యూఢిల్లీ, బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యవాదాన్ని, పవర్ పాలిటిక్స్‌ను వ్యతిరేకించడంలో నాయకత్వ పాత్ర పోషించాలని గత నెలలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, కొన్ని దేశాలకు ప్రపంచ ఆహార పథకం(డబ్ల్యూఎ్‌ఫపీ)లో భాగంగా యూఎ్‌సఎయిడ్‌ను పునరుద్ధరించాలని అమెరికా నిర్ణయించింది. అంతర్యుద్ధం జరుగుతున్న దేశాల్లో యూఎ్‌సఎయిడ్ అందకపోవడంతో లక్షల మంది ఆకలిచావులను ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూఎ్‌ఫపీ ఎక్స్‌లో పోస్టు చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 14 దేశాల్లో డబ్ల్యూఎ్‌ఫపీకి యూఎ్‌సఎయిడ్ అందుతుండగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే..! ఇప్పుడు లెబనాన్, సిరియా, ఇరాక్, జోర్దాన్, ఈక్విడార్, సోమాలియాల్లో సహాయాన్ని కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది.
తగ్గించండి...
విదేశీ కార్ల దిగుమతులపై భారత్ విధిస్తున్న భారీ సుంకాలకు ప్రతిగా ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో.. యూరోపియన్ యూనియన్ కూడా ఆ అంశంపై దృష్టి సారించింది. విదేశీ కార్లపై సుంకాలను సున్నా శాతానికి తగ్గించాలని భారతదేశానికి విజ్ఞప్తి చేసింది. నిజానికి దీనికి సంబంధించిన వాణిజ్య ఒప్పందం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. భారత్ కూడా.. విదేశీ కార్లపై 100 శాతానికి పైగా ఉన్న సుంకాలను దశలవారీగా 10 శాతానికి తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలను, ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ రాయ్‌టర్స్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. కిందటివారం జరిగిన ఒక సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు ఈయూ అభ్యర్థనను, దానిపై ప్రభుత్వ వైఖరిని.. భారీ పరిశ్రమల శాఖ అధికారులు, ఆటో ఇండస్ట్రీ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చనట్టు అందులో పేర్కొంది. భారతీయ కార్ల పరిశ్రమ మాత్రం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాన్ని కనీసం 30 శాతంగా ఉంచాలని, ఈవీలపై విధిస్తున్న దిగుమతి సుంకాలను మరో నాలుగేళ్లపాటు తగ్గించొద్దని పైరవీ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈయూ విజ్ఞప్తి మేరకు భారతదేశం సుంకాలను తగ్గిస్తే.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్ వంటి యూరోపియన్ కార్ల తయారీ దిగ్గజాలకు, అటు అమెరికాకు చెందిన టెస్లా సంస్థకు ప్రయోజనం కలుగుతుంది.
ట్రంప్ దారుణ వ్యాఖ్యలు
అమెరికా విధించిన అడ్డగోలు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. పుండు మీద కారం జల్లినట్టుగా ట్రంప్ ఆ సుంకాలతో ప్రభావితమవుతున్న దేశాలపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆయా దేశాల నేతలందరూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తహతహలాడిపోతున్నారని.. సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ‘‘ప్లీజ్ సర్, ప్లీజ్ సర్ మేం ఏమైనా చేస్తాం సర్’’ అంటూ తమను పదేపదే సంప్రదిస్తున్నారని ఆయన గొప్పలు చెప్పుకొన్నారు. అంతటితో ఆగక.. ‘కిస్సింగ్ మై యా....’ అంటూ రాయడానికి వీల్లేని అసభ్యకరమైన భాషలో దారుణంగా మాట్లాడారు. అలాగే.. ఫార్మా ఉత్పత్తులపైనా భారీగా సుంకాలు విధించబోతున్నట్టు మరోసారి వెల్లడించారు. ‘‘ఆ ప్రకటన చేయగానే ఫార్మా కంపెనీలన్నీ చైనాను, ఇతరదేశాలను వదిలి బారులు తీరుతాయి. ఎందుకంటే.. వారి ఉత్పత్తుల్లో అధిక భాగాన్ని ఇక్కడే అమ్ముకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.