US and India Trade: ఐటీ రంగంపైనా..ట్రంప్ సుంకాలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:20 AM
అమెరికాకు భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులపై 50ు సుంకాలను ప్రకటించిన ట్రంప్ సర్కారు దృష్టి ఇప్పుడు సమాచార సాంకేతిక(ఐటీ) రంగం, ఐటీఈఎస్, రిమోట్ వర్కర్లు, ప్రవాస భారతీయులు పంపే రెమిటెన్స్‌పై పడిందా....
ఐటీఈఎస్, రిమోట్ వర్క్‌పైనా..
రెమిటెన్స్‌లపైనా భారీగా భారం
ఆ మేరకు రీట్వీట్ చేసిన నవారో
న్యూఢిల్లీ/వాషింగ్టన్, సెప్టెంబరు 3: అమెరికాకు భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులపై 50శాతం సుంకాలను ప్రకటించిన ట్రంప్ సర్కారు దృష్టి ఇప్పుడు సమాచార సాంకేతిక(ఐటీ) రంగం, ఐటీఈఎస్, రిమోట్ వర్కర్లు, ప్రవాస భారతీయులు పంపే రెమిటెన్స్‌పై పడిందా? ఆయా సేవలపైనా సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నారా? దీని వల్ల భారత దేశీయోత్పత్తి(జీడీపీ)లో అత్యంత కీలకమైన ఐటీ, సేవా రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. అమెరికా కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధి జాక్ పోసోబిక్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టును వైట్ హౌస్‌లో శక్తిమంతమైన అధికారిగా ఉన్న వాణిజ్య, ఉత్పాదక విభాగాల సీనియర్ సలహాదారు పీటర్ నవారో రీట్వీట్ చేయడం ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. ‘‘అన్ని ఔట్‌సోర్సింగ్‌లపై సుంకం విధించాలి. విదేశాల నుంచి అమెరికాలోని కంపెనీలకు రిమోట్ సర్వీసుల(ఉద్యోగులు)పైనా ప్రివిలేజ్ కోసం సుంకాలు వేయాలి’’ అని పోసోబిక్ ట్వీట్ చేశారు. దాని నవారో వెంటనే రీట్వీట్ చేయడం గమనార్హం..! ఇది కార్యరూపం దాలిస్తే ఐటీతోపాటు.. ఐటీ ఆధారిత సేవారంగం(ఐటీఈఎస్), బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(బీపీవో) ద్వారా విదేశాల నుంచి రిమోట్‌గా పనిచేసే వర్కర్లు/ఉద్యోగులు, అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీల్లో పనిచేసే హెచ్-1బీ వీసాదారులు, భారత్‌కు రెమిటెన్స్ పంపే ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
పుతిన్, జిన్‌పింగ్, కిమ్‌లపై ట్రంప్ ఫైర్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్‌లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ముగ్గురు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చైనా మిలిటరీ పరేడ్‌లో జిన్‌పింగ్‌తో కలిసి కిమ్, పుతిన్, పాల్గొనడంపై ట్రంప్ నిప్పులు కురిపించారు. ‘‘రెండో ప్రపంచయుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికా సైనికుల త్యా గాలను జిన్‌పింగ్ గుర్తిస్తారా? లేదా? వారి త్యాగాన్ని జిన్‌పింగ్ గౌరవిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.