Share News

Trump Statement: అఫ్గానిస్థాన్‌లోకి మళ్లీ అడుగు పెడతాం

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:11 AM

అఫ్గానిస్థాన్‌లోకి తమ సైనిక దళాలను తిరిగి పంపాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు అఽధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది...

Trump Statement: అఫ్గానిస్థాన్‌లోకి మళ్లీ అడుగు పెడతాం

  • బాగ్రాం స్థావరాన్ని స్వాధీనం చేసుకుంటాం

  • తాలిబాన్లకు అప్పగించడం పొరపాటే: ట్రంప్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 19: అఫ్గానిస్థాన్‌లోకి తమ సైనిక దళాలను తిరిగి పంపాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు అఽధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వల్ల కోల్పోయిన కీలకమైన బాగ్రాం సైనిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన ప్రకటించారు. గురువారం బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బాగ్రాం స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే వారికి మాతో కొన్ని అవసరాలున్నాయి. మీకు తెలిసినట్లుగానే చైనా అణ్వాయుధాలు తయారు చేసే ప్రాంతానికి అది కేవలం గంట వ్యవధిలోనే ఉంది. సైనిక పరంగా అత్యంత కీలకమైన ఆ వైమానిక స్థావరాన్ని గత అధ్యక్షుడు బైడెన్‌ తాలిబాన్‌లకు ఉచితంగా ఇచ్చేశారు. అలా జరగకూడదు.’’ అని అన్నారు. అమెరికా సైనికులు మొదట అఫ్గానిస్థాన్‌ను వదిలివెళ్లాలని నిర్ణయించినా, ఆ స్థావరాన్ని మాత్రం తమతోనే ఉంచుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే అది ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక స్థావరాలలో ఒకటని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Sep 20 , 2025 | 04:11 AM