US President Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:29 AM
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చేరువ అయ్యామని, ఒప్పందాలపై ఉత్సాహంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించింది
ఈ నేపథ్యంలో మేం సుంకాలు తగ్గిస్తాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
విదేశీ విద్యార్థులు అమెరికా వస్తే మంచిదే
రాకుంటే కొన్ని విద్యాసంస్థలకు వ్యాపారాలు ఉండవని వ్యాఖ్య
న్యూయార్క్, నవంబరు 11: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చేరువ అయ్యామని, ఒప్పందాలపై ఉత్సాహంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఏదో ఒక దశలో భారత్‌పై విధించిన సుంకాలను కూడా తగ్గిస్తామని చెప్పారు. కాగా, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై గడిచిన రెండు వారాల్లో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. అయితే, ఒప్పందాలపై ట్రంప్ అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారా?.. లేక నిజంగా ఇరు దేశాల మధ్య చర్చల్లో బలమైన పురోగతి కనిపించిందా?.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ‘‘గతంలో ఉన్న ఒప్పందాలకు పూర్తి భిన్నంగా భారత్‌తో మేం ఒప్పందాలు చేసుకుంటున్నాం. నన్ను వారు ఇష్టపడకపోయినా.. మమ్మల్ని ఇష్టపడతారు.’’ అని సోమవారం ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గార్‌తో ఓవల్ ఆఫీసులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాల విషయంపై మాట్లాడుతూ.. భారత్-అమెరికాల మధ్య న్యాయపరమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నారు. ఈ ఒప్పందాలకు ప్రతి ఒక్కరికీ మేలు చేస్తాయని వ్యాఖ్యానించారు. సెర్గియో కూడా విషయాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు గుప్పించారు. ఆయనకు భారత దేశం గురించి ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సుంకాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని, కాబట్టి సుంకాలను గణనీయంగా తగ్గిస్తామని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉండగా, తన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసిన వ్యవహారంలో బీబీసీపై బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,845 కోట్లు)కు పరువు నష్టం దావా వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ న్యాయవాదులు బీబీసీకి లేఖ రాశారు.