U S President Donald Trump: అమెరికాలో తగినంత ప్రతిభావంతులు లేరు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:19 AM
విదేశీ ఉద్యోగులపై ఆంక్షలతో తన యంత్రాంగం ఓ పక్క విరుచుకుపడుతుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హెచ్1బీ వీసాలపై యూటర్న్ తీసుకున్నారు....
విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది
హెచ్1బీపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్
న్యూయార్క్, నవంబరు 12: విదేశీ ఉద్యోగులపై ఆంక్షలతో తన యంత్రాంగం ఓ పక్క విరుచుకుపడుతుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హెచ్1బీ వీసాలపై యూటర్న్ తీసుకున్నారు. అమెరికాలోని వివిధ విభాగాల్లో పనిచేసేందుకు విదేశీ ఉద్యోగులను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఫాక్స్ టీవీతో ట్రంప్ మాట్లాడారు. అమెరికాలోనే సమృద్ధిగా ప్రతిభావంతులు ఉన్నారు కదా.? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘మనదేశంలో లేరు’ అంటూ కరాకండిగా చెప్పారు. పలు విభాగాల్లో ప్రతిభగల వారి కొరత ఉందని పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగులు బయటనుంచి వచ్చిన వారి వద్ద నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరైన శిక్షణ లేకుండా, నిరుద్యోగులు అనే పేరుతో ఫ్యాక్టరీల్లో ఉద్యోగాల్లో పెట్టలేమన్నారు. తన ప్రభుత్వానికి హెచ్1బీ వీసా పెద్ద ప్రాధాన్యం కాదని ఆయన అన్నారు.