Share News

Donald Trump: నాకు నోబెల్‌ ఇవ్వకపోతే.. దేశానికే అవమానం!

ABN , Publish Date - Oct 02 , 2025 | 02:57 AM

నోబెల్‌ శాంతి బహుమతి కోసం కలవరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు నోబెల్‌ ఇవ్వకపోతే...

Donald Trump: నాకు నోబెల్‌ ఇవ్వకపోతే.. దేశానికే అవమానం!

  • నాకివ్వమని అడగట్లేదు

  • అమెరికాకు ఇవ్వమంటున్నా

  • ఏడు యుద్ధాలను ఆపాం: ట్రంప్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 1: నోబెల్‌ శాంతి బహుమతి కోసం కలవరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు నోబెల్‌ ఇవ్వకపోతే.. అది అమెరికాకే అవమానం.’’ అని అన్నారు. అంతేకాదు.. ప్రపంచ దేశాల్లో తలెత్తిన ఏడు యుద్ధాలను తాను ఆపిన తర్వాత కూడా.. నోబెల్‌ ఇవ్వకపోతే.. అగ్రరాజ్యాన్ని అవమానించినట్టేనని చెప్పారు. తాజాగా గాజా యుద్ధానికి కూడా ముగింపు పలికేలా తాను తీసుకుంటున్న చర్యలను ఆయన ఉటంకించారు. మంగళవారం క్వాంటికోలో సైనిక అధికారులతో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒక పుస్తకం రాసిన వ్యక్తికి ఇస్తారని, కానీ, ఈసారి అలా జరగదని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ తనను కాదని ఏ రచయితకైనా ఇస్తే అది అమెరికాకు తీరని అవమానమేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ‘‘నోబెల్‌ను నాకు ఇవ్వమని అడుగుతున్నట్టు భావిస్తున్నారు. నిజానికి నాకు ఇవ్వాలని కాదు. ఈ దేశానికి ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే.. గతంలో ఎప్పుడు జరగని పనులు ఇప్పుడు జరిగాయి. దీనిపై ఆలోచన చేయాలని చెబుతున్నా. ఇప్పుడు గాజా విషయాన్నే తీసుకుంటే.. ఇదేమంత తేలికకాదు. చాలా సంక్లిష్టం. అయినా.. సాధిస్తున్నాం. మధ్యవర్తిత్వం, ఒప్పందాల వంటి విషయాలు నాకన్నా ఎవరికీ ఎక్కువగా తెలియవు. నా జీవితమంతా వాటిపైనే ఆధారపడింది. ఇప్పటికే ఏడు సాధించాం. ఇప్పుడు ఎనిమిదోది కూడా సాధించబోతున్నాం. ఇదేమంత తేలికకాదని చెబుతున్నా. అందుకే నోబెల్‌ మనకే ఇవ్వాలని కోరుతున్నా.’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 02 , 2025 | 02:57 AM