Share News

Donald Trump Quest for Rare Minerals: అరుదైన ఖనిజాల కోసం ట్రంపర్లాట

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:44 AM

జానపద కథల్లో మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు.. ప్రస్తుతం అమెరికా సహా కీలక దేశాల టెక్నాలజీ అవసరాలన్నీ చైనా చేతిలో చిక్కుకుపోయాయి.

Donald Trump Quest for Rare Minerals: అరుదైన ఖనిజాల కోసం ట్రంపర్లాట

  • అరుదైన ఖనిజాల అన్వేషణ, లోహాల ప్రాసెసింగ్‌పై దృష్టి

  • ఆ దిశగా ఆస్ట్రేలియాతో ఒప్పందం.. పాక్‌ నుంచీ సమకూర్చుకునే యత్నాలు

(సెంట్రల్‌ డెస్క్‌): జానపద కథల్లో మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు.. ప్రస్తుతం అమెరికా సహా కీలక దేశాల టెక్నాలజీ అవసరాలన్నీ చైనా చేతిలో చిక్కుకుపోయాయి. మొబైల్‌ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల వరకు, శాటిలైట్ల నుంచి క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల వరకు ఎంతో కీలకమైన ‘అరుదైన మూలకాల’పై చైనా ఆధిపత్యమే దీనికి కారణం. రష్యా నుంచి చమురు కొంటోందంటూ భారత్‌పై అడ్డగోలు టారి్‌ఫలు వేసిన ట్రంప్‌.. మనకన్నా ఎక్కువ చమురు కొంటున్న చైనా జోలికి మాత్రం వెళ్లలేకపోతున్నారు. టారి్‌ఫలు వేస్తామని ట్రంప్‌ బెదిరించగానే.. అరుదైన లోహాల సరఫరాపై చైనా నియంత్రణలు పెట్టింది. దీనితో చైనాపై 155శాతం టారి్‌ఫలు వేస్తానని ట్రంప్‌ తాజాగా హెచ్చరించారు. త్వరలో దక్షిణ కొరియాలో జరిగే సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానని కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ చైనా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీనితో ట్రంప్‌ మెత్తబడ్డారు. సోమవారం శ్వేతసౌధంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌సతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిన్‌పింగ్‌తో జరగనున్న భేటీలో అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకుంటామని, ఇరు దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నింటికీ ప్రయోజనం ఉంటుందని ప్రకటించడం గమనార్హం. అయితే ‘అరుదైన లోహాల’పై చైనా ఆధిపత్యాన్ని భగ్నం చేసే దిశగానే ఆస్ట్రేలియా ప్రధానితో ట్రంప్‌ భేటీకావడం గమనార్హం. అరుదైన లోహాల మైనింగ్‌ కోసం ఇటీవల పాకిస్థాన్‌తో కూడా అమెరికా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

గాలియం, లీథియం లోహాల కోసం..

ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో అరుదైన ఖనిజాల నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని వెలికితీయడం, శుద్ధి చేసి, లోహాలను రూపొందించే ప్రక్రియ చాలా వ్యయం, శ్రమతో కూడుకున్నది. పైగా తీవ్రమైన పర్యావరణ కాలుష్యం సమస్య కూడా. కొన్ని దేశాలు ఈ అరుదైన ఖనిజాలను వెలికితీస్తున్నా.. ప్రాసెసింగ్‌ కోసం చైనాకు పంపించాల్సిందే. ఈ రంగంలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికే ట్రంప్‌ ఆస్ట్రేలియాతో రూ.75 వేల కోట్ల (8.5 బిలియన్‌ డాలర్లు) ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజాలను తవ్వి, ప్రాసెస్‌ చేసేందుకు అమెరికాకు వీలుకలుగుతుంది. ఈ ఒప్పందం మేరకు పశ్చిమ ఆస్ట్రేలియాలో వార్షికంగా 100 మెట్రిక్‌ టన్నుల గాలియం లోహాన్ని ఉత్పత్తి చేయగల రిఫైనరీని నెలకొల్పనున్నారు. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా చేపడుతున్న లీథియం ఉత్పత్తిని మరింత పెంచి, అమెరికాకు సరఫరా చేయనున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 05:44 AM