Former US President Donald Trump: మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:04 AM
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు. ఆయన నాయకత్వం బాగుంది. అని వ్యాఖ్యానించారు...
వచ్చే ఏడాది భారత్‌కు వెళ్లొచ్చు : ట్రంప్
వాషింగ్టన్, నవంబరు 7: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు. ఆయన నాయకత్వం బాగుంది.’’ అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో.. శుక్రవారం జరిగిన కార్యరక్రమంలో బరువు తగ్గించే ఔషధాల ధరలు దిగివచ్చేలా ట్రంప్ కొత్త ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేసే ప్రక్రియను ఆయన తగ్గించారు. నన్ను అక్కడకు(భారత్) రావాలని మోదీ కోరుతున్నారు. ఈ విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం. నేను భారత్‌కు వెళ్తా.’’ అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు, తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్నీ 150 సార్లు పేల్చేయగలమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యాలు అత్యంత రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన అణు నిరాయుధీకరణకు పిలుపునిచ్చారు. మరుక్షణమే.. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలమని హెచ్చరించారు. ‘‘అణు నిరాయుధీకరణపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లతో మాట్లాడా. ప్రపంచ వ్యాప్తంగా శాంతి విలసిల్లాలని కోరుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఆ మరు నిమిషంలోనే.. తాము తక్షణమే అణు పరీక్షలు చేపడతామంటూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.