Share News

Donald Trump: అణు పరీక్షలు వెంటనే మొదలుపెట్టండి

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:35 AM

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో దూకుడుగా సాగిన ‘అణ్వస్త్ర’ పోటీ మళ్లీ మొదలవుతోంది. అణ్వస్త్రాల విషయంలో రష్యా, చైనా దూకుడు మీద ఉన్నాయని...

 Donald Trump: అణు పరీక్షలు వెంటనే మొదలుపెట్టండి

  • పెంటగాన్‌కు ట్రంప్‌ ఆదేశం

  • దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యా, చైనాలకు దీటుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి

బుసాన్‌, అక్టోబరు 30: ప్రచ్ఛన్న యుద్ధకాలంలో దూకుడుగా సాగిన ‘అణ్వస్త్ర’ పోటీ మళ్లీ మొదలవుతోంది. అణ్వస్త్రాల విషయంలో రష్యా, చైనా దూకుడు మీద ఉన్నాయని, ఈ నేపథ్యంలో అమెరికా కూడా అణు పరీక్షలు నిర్వహిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దక్షిణకొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ట్రూత్‌ సోషల్‌లో దీనికి సంబంధించి పోస్టు పెట్టడం గమనార్హం. అంతేకాదు అమెరికాకు తిరిగి వెళుతుండగా ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానంలోనూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇతర దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయి. ఆ దూకుడుకు దీటుగా నిలిచేందుకు అమెరికా కూడా అణు పరీక్షలు నిర్వహించడం సమంజసమని భావిస్తున్నాను. వెంటనే మన అణు పరీక్షలు మొదలుపెట్టాలని యుద్ధ శాఖను (రక్షణ శాఖకు ట్రంప్‌ పెట్టిన పేరు) ఆదేశించాను. అణుశక్తిలో ఇప్పుడైతే రష్యా రెండో స్థానంలో ఉంది. చాలా దూరంలోనే అయినా చైనా మూడో స్థానంలో ఉంది. కానీ ఐదేళ్లలో దగ్గరికి చేరుకోవచ్చు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అణు పరీక్షలు నిర్వహించే ప్రాంతాలను త్వరలో ఎంపిక చేస్తామని చెప్పారు. నిజానికి తాను అణు నిరాయుధీకరణను కోరుకుంటానని, దీనిపై రష్యాతో ఇప్పటికే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

అణ్వస్త్ర పోటీకి దారితీస్తుందా?

అణు పరీక్షలు నిర్వహించాలన్న ట్రంప్‌ నిర్ణయంతో మళ్లీ అణ్వస్త్ర పోటీ మొదలవుతుందేమోనన్న చర్చలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశాలు 1996లో ‘సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆ ఒప్పందం నుంచి బయటికి వస్తున్నట్టు 2023లో ప్రకటించారు. అమెరికాకు చెందిన ఆర్మ్స్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం ప్రస్తు తం అమెరికా వద్ద 5,225 అణ్వస్త్రాలు, రష్యా వద్ద 5,580 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇక సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నివేదిక ప్రకారం.. 2020లో చైనా వద్ద 300 అణ్వస్త్రాలు ఉండగా, ప్రస్తు తం 600కు చేరాయి. ‘ఇంటర్నేషనల్‌ క్యాంపెయిన్‌ టు అబోలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ (ఐసీఏఎన్‌డబ్ల్యూ) గణాంకాల ప్రకారం.. ఫ్రాన్స్‌ వద్ద 290 అణ్వస్త్రాలు, యూకే 225, భారత్‌ 180, పాకిస్థాన్‌ 170, ఇజ్రాయెల్‌ 90, ఉత్తరకొరియా వద్ద 50 అణ్వస్త్రాలు ఉన్నాయి.

Updated Date - Oct 31 , 2025 | 03:35 AM