Share News

US Turkey Relations: భారత వైరి దేశాలతో ట్రంప్‌ వరుస భేటీలు!

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:48 AM

భారత వైరి దేశాలు తుర్కియే, పాకిస్థాన్‌లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వరుస భేటీలు నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం..

US Turkey Relations: భారత వైరి దేశాలతో ట్రంప్‌ వరుస భేటీలు!

  • తొలుత తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశం.. పౌర అణు భాగసామ్య ఒప్పందంపై సంతకాలు

  • తర్వాత పాక్‌ ప్రధాని ఆర్మీ చీఫ్‌తో సమావేశం

న్యూయార్క్‌/ఇస్లామాబాద్‌, సెప్టెంబరు 26: భారత వైరి దేశాలు తుర్కియే, పాకిస్థాన్‌లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వరుస భేటీలు నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం శ్వేతసౌధంలో ఈ సమావేశాలు జరిగాయి. మొదట తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో ట్రంప్‌ సమావేశమయ్యారు. యూఎ్‌సఏ, తుర్కియే మధ్య పౌర అణు సహకారం, తుర్కియే ఎఫ్‌-35 యుద్ధ విమానాల విక్రయం అంశంపై చర్చించారు. యుద్ధ విమానాల కొనుగోలుపై స్పష్టత రాకపోయినా పౌర అణు సహకారంపై మాత్రం ఒప్పందానికి వచ్చారు. ఈ మేరకు ట్రంప్‌, ఎర్డోగాన్‌ల సమక్షంలో ‘వ్యూహాత్మక పౌర అణు సహకారం’ ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబి యో, తుర్కియే మంత్రి బేరాక్తర్‌ సంతకాలు చేశారు. నిజానికి నాటో సభ్యదేశమైన తుర్కియేకు అత్యాధునిక ఎఫ్‌-35 ఫైటర్లను సరఫరా చేయడానికి గతంలో అమెరికా ముందుకొచ్చింది. కానీ తుర్కియే 2019లో రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడంతో ఎఫ్‌-35 ఫైటర్లు ఇవ్వలేదు. రష్యా క్షిపణి రక్షణ వ్యవస్థను వదులుకుంటే ఎఫ్‌-35 ఫైటర్లను ఇవ్వడానికి సిద్ధమని ఇటీవల ఆఫర్‌ చేసింది. దీనిపైనే ట్రంప్‌, ఎర్డోగాన్‌ తాజాగా చర్చలు జరిపారు. ఫైటర్ల విక్రయం, ఆంక్షల ఎత్తివేతపై ట్రంప్‌ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు భేటీ అనంతరం ఎర్డోగాన్‌ పేర్కొన్నారు.


పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సుదీర్ఘ భేటీ..

పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌లతోనూ శ్వేతసౌధంలో ట్రంప్‌తో భేటీ అయ్యారు. చాలావరకు ట్రంప్‌ భేటీలకు మీడియాను అనుమతిస్తారు. కానీ ఈ భేటీకి మీడియాను అనుమతించకుండా సుమారు 80 నిమిషాల పాటు చర్చించారు. ఇందులో వారితోపాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై సహకారం తదితర అంశాలపై వారు చర్చించినట్టు అమెరికా అధికార వర్గాలు పే ర్కొన్నాయి. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శ్వేతసౌధంలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతకు ముందు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌) ఆసిమ్‌ గొప్ప వ్యక్తులని ట్రంప్‌ అభివర్ణించారు.

కోటుకు యుద్ధ విమానం పిన్‌ పెట్టుకుని..

శ్వేతసౌధంలో తుర్కియే, పాక్‌ నేతలతో చర్చల సమయంలో ట్రంప్‌ తన కోటుకు యుద్ధ విమానం చిత్రమున్న పిన్‌ను పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ రెండూ భారత్‌కు వైరి దేశాలు కావడంతో.. ట్రంప్‌ పరోక్షంగా ఏవో సంకేతాలు ఇస్తున్నారనే ప్రచారం జరిగింది.అయితే తుర్కియేకి ఎఫ్‌-35 విమానాలు విక్రయించే అంశంపై చర్చ నేపథ్యంలోనే ట్రంప్‌ అలా పిన్‌ పెట్టుకున్నారని శ్వేతసౌధం అధికారవర్గాలు పేర్కొన్నాయి. కానీ తర్వాత మీడియా సమావేశంలోనూ, పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో భేటీ సమయంలోనూ ట్రంప్‌ ఆ యుద్ధ విమానం పిన్‌ను పెట్టుకునే ఉండటం గమనార్హం.

Updated Date - Sep 27 , 2025 | 02:48 AM