Share News

US President Donald Trump: బీబీసీపై ట్రంప్‌ 90వేల కోట్ల దావా

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:53 AM

అమెరికాలోని క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని ఎడిట్‌ చేసి ప్రసారం చేసినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలంటూ బీబీసీపై.....

US President Donald Trump: బీబీసీపై ట్రంప్‌ 90వేల కోట్ల దావా

వాషింగ్టన్‌, డిసెంబరు 16: అమెరికాలోని క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని ఎడిట్‌ చేసి ప్రసారం చేసినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలంటూ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దావా వేశారు. అలాగే, చట్ట నిబంధలను ఉల్లంఘించి అక్రమ వ్యాపార పద్ధతులకు బీబీసీ పాల్పడుతోందని కూడా ఆయన ఆరోపించారు. ఈ రెండు కారణాల రీత్యా, ఒక్కో దానికి 5బిలియన్‌ డాలర్లు చొప్పున మొత్తం 10 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.90వేల కోట్లు) చెల్లించాలని 33 పేజీల దావా పత్రంలో ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. గెలుపును తస్కరించారంటూ అప్పటి అధ్యక్షుడు బైడెన్‌కు వ్యతిరేకంగా 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్‌ హిల్‌పై దాడికి ట్రంప్‌ మద్దతుదారులు సిద్ధమయ్యారు. వారిని ఉద్దేశించి ట్రంప్‌ గంటసేపు మాట్లాడారు. ‘ట్రంప్‌- రెండో చాన్స్‌’ పేరిట ఈ ప్రసంగాన్ని 2024 ఎన్నికలకు ముందు బీబీసీ ప్రసారం చేసింది. ‘ఘోరంగా పోరాడదాం..’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రధానం చేసి, ‘శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిద్దాం.. దేశభక్తిని ప్రదర్శిద్దాం..’ అన్న అభ్యర్థనలను మాత్రం తొలగించి తన ప్రసంగాన్ని ప్రసారం చేశారనేది ట్రంప్‌ ప్రధాన ఆరోపణ. పొంతన లేని రెండు వేర్వేరు భాగాలను ఒకచోట అతికించడం ద్వారా తన మాటలను వక్రీకించారని ట్రంప్‌ తన దావా పత్రంలో ఆరోపించారు. తనను అవమానించి, పరువు తీసి, రాజకీయంగా నష్టం కలిగించాలనే తప్పుడు, మోసపూరిత ఉద్దేశాలతోనే బీబీసీ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. అయితే.. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు గతంలోనే బీబీసీ క్షమాపణలు తెలిపింది.

Updated Date - Dec 17 , 2025 | 03:53 AM