Trump backs skilled foreign talent: విదేశీ నిపుణులను ఆహ్వానిస్తా!
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:29 AM
విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాను ఆహ్వానిస్తానన్నారు. అలాంటి వారు చిప్‌లు, క్షిపణులు వంటి సంక్లిష్ట ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలన్నది అమెరికా ఉద్యోగులకు నేర్పిస్తారని చెప్పారు.....
వారు అమెరికన్లకు మెళకువలు నేర్పాలి
విదేశీ నిపుణుల విషయంలో ‘మాగా’ మద్దతుదారులఆగ్రహాన్ని ఎదుర్కొనేందుకూ సిద్ధం
అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరంలో ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, నవంబరు 20: విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాను ఆహ్వానిస్తానన్నారు. అలాంటి వారు చిప్‌లు, క్షిపణులు వంటి సంక్లిష్ట ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలన్నది అమెరికా ఉద్యోగులకు నేర్పిస్తారని చెప్పారు. ఈ విషయంలో తన మద్దతుదారుల నుంచి కొంత ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత్-పాక్‌పై 350ు సుంకాలు తప్పవని హెచ్చరించా
భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి చెప్పారు. యుద్ధాన్ని ఆపకపోతే ఇరుదేశాలపై 350ు సుంకాలు విధిస్తానని, అమెరికాతో వాణిజ్యం లేకుండా చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. యుద్ధాన్ని ఆపితే మంచి వాణిజ్య ఒప్పందం చేసుకుందామని చెప్పానన్నారు. అప్పుడు భారత ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి ‘మేం యుద్ధానికి వెళ్లడం లేదు’ అని చెప్పారని ట్రంప్ వెల్లడించారు.
వలసదారుల పాత్ర ఎనలేనిది: సుందర్ పిచాయ్
అమెరికా టెక్నాలజీ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర ఎనలేనిదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల వ్యవస్థలో మార్పులు ప్రతిపాదించడంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో పిచాయ్ వ్యాఖ్య లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ వార్తా సంస్థతో పిచాయ్ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ అభివృద్ధి చరిత్రను పరిశీలిస్తే.. వలసదారుల భాగస్వామ్యం అత్యద్భుతం’’ అని చెప్పారు. హెచ్-1బీ వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే, సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికైన డెమొక్రటిక్ నేత జోహ్రాన్ మమ్దానీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. శ్వేతసౌధంలో ఈ సమావేశం జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఉక్రెయిన్‌లో శాంతికోసం.. ట్రంప్ 28 సూత్రాల ప్రణాళిక!
మూడేళ్లుగా యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి 28 సూత్రాల శాంతి ప్రణాళికను రూ పొందించారు. రష్యా కోసం ట్రంప్ నియమించిన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా దౌత్యవేత్త కిరిల్ దిమిత్రీవ్, ఉక్రెయిన్ అధికారుల మధ్య సంప్రదింపులతో సిద్ధం చేసిన ఈ ప్రణాళికను ట్రంప్ తాజాగా ఆమోదించినట్టు తెలిసింది. అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ సహా పలు అంతర్జాతీయ పత్రికలు దీనిపై కథనాలు ప్రచురించాయి. ఉక్రెయిన్ భూభాగాలను వదులుకోవడం నుంచి సైన్యాన్ని, ఆయుధాలను తగ్గించుకోవడం దాకా పలు కీలకమైన షరతులు ఈ శాంతి ప్రణాళికలో ఉన్నట్టు తెలిసింది.