Former President Donald Trump: పేద దేశాల పౌరులకు నో ఎంట్రీ
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:28 AM
ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మూడో ప్రపంచ దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు...
19 దేశాల పౌరులకు అమెరికా గేట్లు మూత.. వారి ఇమిగ్రేషన్ దరఖాస్తులపై నిరవధిక నిషేధం
న్యూయార్క్/వాషింగ్టన్, నవంబరు 28: ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మూడో ప్రపంచ దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశాల పౌరులవల్లే అమెరికాలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత అధ్యక్షుడు జో బైడెన్ నిద్ర మత్తులో ఒక్క సంతకం చేసి ఇలాంటివారిని వేలమందిని అమెరికాలోకి రానిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారివల్ల అమెరికాలోని పశ్చిమదేశాల సంస్కృతి నాశనమవుతోందని నిందించారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డు దళ సిబ్బందిపై అఫ్గాన్ జాతీయుడు బుధవారం కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ గురువారం తన సొంత సోషల్‌మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ‘సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా.. లోపభూయిష్టమైన వలస విధానాల వల్ల వాటి ఫలితాలను అనుభవించలేకపోతున్నాం. అందువల్ల మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తాను. అమెరికాకు ఏమాత్రం ఉపయోగపడని వారిని, అమెరికాను ప్రేమించని వారిని దేశం నుంచి తరిమేస్తా’ అని ప్రకటించారు. అమెరికా సమాఖ్య ప్రభుత్వం అందించే ఏ సబ్సిడీలుకానీ, ప్రయోజనాలు కానీ అమెరికా పౌరులు కానివారికి ఇకపై లభించవని ట్రంప్ ప్రకటించారు. ‘అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దాలంటే తిరోగమన వలసలే మార్గం’ అని స్పష్టంచేశారు. ‘దొంగలు, హంతకులు, అమెరికాలో ప్రతిదాన్నీ నాశనం చేస్తున్నవారికి తప్ప మిగతా అమెరికా పౌరులందరికీ థ్యాంక్స్ గివింగ్ డే శుభాకాంక్షలు’ అని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. అమెరికాలో ప్రస్తుతం 5.3 కోట్లమంది విదేశీయులు ఉన్నారని, వారిలో చాలామంది ప్రభుత్వ సహాయం పొందుతున్నారని తెలిపారు. గ్రీన్‌కార్డుపై అమెరికాలో ఉంటూ ఏటా 30 వేల డాలర్లు సంపాదించుకుంటున్న ఒక వ్యక్తి..
ఏటా 50 వేల డాలర్ల విలువైన ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నాడు అని చెప్పారు. సోమాలియా నుంచి వచ్చిన వేలమంది శరణార్థులతో అందమైన మిన్నెసోటా రాష్ట్రం నిండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికా పార్లమెంటు సభ్యురాలు, డెమోక్రాటిక్ నాయకురాలు ఇల్హాన్ ఒమర్‌పై ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోమాలియాలో జన్మించిన ఆమె.. అమెరికాకు వలస రావటానికి సోదరుడిని వివాహం చేసుకుందని ఆరోపించారు. కాగా, ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే గ్రీన్‌కార్డు పొందినవారి దరఖాస్తులను కూడా మరోసారి లోతుగా విశ్లేషించనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎ్‌ససీఐఎస్) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తెలిపారు. ట్రంప్ ఆదేశాల మేరకు 19 దేశాల నుంచి వలసలను నిరవధికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఆ దేశాల జాబితాలను విడుదల చేశారు. కాగా, అఫ్గాన్ జాతీయుడు లకన్‌వాల్ కాల్పుల్లో బుధవారం తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు నేషనల్ గార్డు సభ్యుల్లో సారా (20) అనే మహిళా గార్డు మరణించినట్లు ట్రంప్ ప్రకటించారు.
త్వరలో వెనుజువెలాలో సైనిక చర్య
వెనుజువెలాలోని మాదకద్రవ్యాల ముఠాలను అంతం చేసేందుకు అతి త్వరలో ఆ దేశంలో భూమార్గంలో దాడులు నిర్వహిస్తామని ట్రంప్ ప్రకటించారు. వెనుజువెలా నుంచి సముద్రమార్గంలో అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్‌ను తమ సైనిక దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నాయని ప్రశంసించారు. భూమార్గంలో కూడా ఆ దేశంలో దాడులు చేసి డ్రగ్స్ ముఠాలను అంతం చేస్తామని తెలిపారు.
ట్రంప్‌నకు చేతకావటంలేదు
ట్రంప్ శారీరక, మానసిన సామర్థ్యంపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. 79 ఏళ్ల ట్రంప్‌నకు అధ్యక్ష విధులు నిర్వహించటం చేతకావటం లేదని, అధికారిక సమావేశాల్లో అలసటతో మాట్లాడలేకపోతున్నారని పేర్కొంది. ఈ కథనాన్ని ట్రంప్ ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అందుకు ఇటీవల తాను వరుసగా నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలే నిదర్శనమన్నారు.
ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్టులు
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధికారులు.. గ్రీన్‌కార్డు దరఖాస్తు దారులను ఇంటర్వ్యూలకు పిలిచి మరీ అరెస్టు చేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూఎ్‌ససీఐఎస్ ఆఫీసులో గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తి చేతులకు పోలీసులుబేడీలు వేసి ఈడ్చుకువెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. అమెరికా పౌరురాలైన అతడి జీవిత భాగస్వామిని కూడా అరెస్టు చేసినట్లు బాధితుడి న్యాయవాది టెస్సా కబ్రెరా మీడియాకు తెలిపారు. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నవారిని ఆఫీసుకు పిలిచి మరీ అరెస్టు చేస్తున్నారని మరో లాయర్ చెప్పారు.