Trump: మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:05 AM
భారత్‌పై సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యమధ్యలో మెత్తటి మాటలు మాట్లాడుతున్నారు..
వాణిజ్యంపై సంప్రదింపులు జరుగుతున్నాయ్
ట్రూత్ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులు
భారత్-అమెరికా సహజ భాగస్వాములు
ట్రంప్ పోస్టులపై మోదీ సానుకూల స్పందన
న్యూఢిల్లీ, వాషింగ్టన్, సెప్టెంబరు 10: భారత్‌పై సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యమధ్యలో మెత్తటి మాటలు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చల్లో అడ్డంకులను తొలగించడానికి తన యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోందంటూ ట్రూత్ సోషల్‌లో తాజాగా పోస్ట్ పెట్టారు. దీనిపై రాబోయే వారాల్లో తన స్నేహితుడైన ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్‌లో ప్రస్తావించారు. చర్చలు రెండు దేశాలకూ సత్ఫలితాలిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై మోదీ స్పందించారు. భారత్-అమెరికా సన్నిహిత స్నేహితులని, సహజ భాగస్వాములని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. వాణిజ్య చర్చలు త్వరగా ముగించేందుకు రెండు దేశాలు యత్నిస్తున్నాయని చెప్పారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. రెండు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు.