Chemistry Nobel: ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్ర నోబెల్
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:06 AM
ఈ ఏడాది వైద్య, భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారాలను ముగ్గురేసి శాస్త్రవేత్తలకు ప్రకటించిన నోబెల్ కమిటీ....
ఎంవోఎ్‌ఫలను అభివృద్ధి చేసిన సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్,
ఒమర్ ఎం యాఘీలకు సంయుక్తంగా ప్రకటించిన నోబెల్ కమిటీ
స్టాక్‌హోం, అక్టోబరు 8: ఈ ఏడాది వైద్య, భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారాలను ముగ్గురేసి శాస్త్రవేత్తలకు ప్రకటించిన నోబెల్ కమిటీ.. రసాయన శాస్త్ర నోబెల్‌నూ ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంవోఎ్‌ఫల) అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినందుకుగాను.. జపాన్‌కు చెందిన సుసుము కిటగావా (74), ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ రాబ్సన్ (88), జోర్డాన్‌లోని ఒక పేద కుటుంబం నుంచి అమెరికాకు వలసవచ్చి ఉన్నతచదువులు చదివిన ఒమర్ మువాన్నెస్ యాఘీలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు వెల్లడించింది. 1989ల్లో జరిపిన విశేష పరిశోధనలతో వీరు ముగ్గురూ ఒక కొత్త తరహా మాలిక్యులార్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ గురించి సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. లోహ అయాన్లు (మెటల్), కర్బన సమ్మేళనాల(ఆర్గానిక్)తో వీరు ఒక జాలీ లాంటి నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. అత్యంత సూక్ష్మమైన రంధ్రాలు కలిగిన స్పాంజీ నీటిని పీల్చుకున్నట్టుగా.. వీరు తయారుచేసిన మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ వాయువులను తన లోపలికి పీల్చేసుకుంటుంది. ఇంధన రూపంలో ఉదజని (హైడ్రోజన్) నిల్వకు.. వాతావరణంలోని బొగ్గుపులుసువాయువు (కార్బన్‌డయాక్సైడ్)ను క్యాప్చర్ చేయడానికి.. ఔషధాల రవాణా, తదితర రంగాల్లో ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎడారి గాలుల నుంచి నీటిని సంగ్రహించడానికి, విషవాయువుల నిల్వకు, రసాయన ప్రతిస్పందనల ప్రేరేపణకు ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ను ఉపయోగించవచ్చని నోబెల్ కమిటీ ఒక ప్రకటనలో వివరించింది. కాగా, ఈ ముగ్గురిలో.. సుసుము కిటగావా 1989లో ఎంవోఎ్‌ఫల అభివృద్ధికి కీలకమైన పోరస్ కో-ఆర్డినేషన్ పాలిమర్స్ అనే భావనను పరిచయం చేశారు. వాయువుల నిల్వకు, వాయువులను వేరుచేయడానికి వాటిని ఎలా వాడుకోవాలనేదానిపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. అందుకే ఆయన్ను మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ పితామహుడుగా పరిగణిస్తారు. రిచర్డ్ రాబ్సన్ 1990లో.. లోహ అయాన్లు, ఆర్గానిక్ లింకర్లను కలిపి 2డి, త్రీడీ జాలీలను నిర్మించవచ్చని నిరూపించారు. అందుకే ఆయన్ను ‘నెట్‌వర్క్ కెమిస్ట్రీ పయనీర్’గా అభివర్ణిస్తారు. వీరిద్దరి పరిశోధనల ఆధారంగా 1995లో మువాన్నెస్ యాఘీ ఎంవోఎ్‌ఫలను సైద్ధాంతికంగా, నిర్మాణాత్మకంగా, మరింత అధునాతనంగా అభివృద్ధి చేశారు. అందుకే ఆయన్ను ఎంవోఎ్‌ఫల వ్యవస్థాపకుడుగా పేర్కొంటారు. సుసుము కిటగావా ప్రస్తుతం క్యోటో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రాబ్సన్ యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌లో, యాఘీ యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా (బర్కిలీ)లో సేవలందిస్తున్నారు.