PM Narendra Modi: సింథటిక్ డ్రగ్స్ మహా ప్రమాదం
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:57 AM
ఉగ్రవాదం-మాదకద్రవ్యాల వెన్ను విరిచేందుకు జీ-20 ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ప్రపంచ ఉగ్రవాదానికి దాంతోనే ఊపిరి
రెండింటి ఆర్థిక మూలాలనూ దెబ్బతీయాలి
అందుకు ప్రపంచదేశాలు కలిసి పని చేయాలి
జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
యుద్ధాలు, అంతర్యుద్ధాలతో పేద దేశాలకు భారం
ఉక్రెయిన్, పాలస్తీనా పరిష్కారానికి కృషి చేద్దాం
పర్యావరణ లక్ష్యాలను సాధిద్ధాం: జీ20 తీర్మానం
జోహెన్నెస్‌బర్గ్, నవంబరు 22: ఉగ్రవాదం-మాదకద్రవ్యాల వెన్ను విరిచేందుకు జీ-20 ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఫెంటానిల్ లాంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా, వినియోగం శరవేగంగా విస్తరిస్తోందని, ఉగ్రవాదానికి ఇంధనంగా పనిచేస్తున్న ఈ సమస్యను సత్వరమే అరికట్టాల్సి ఉందని చెప్పారు. ఫెంటానిల్ లాంటి సింథటిక్ డ్రగ్స్ వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా, సమాజంలో సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, ప్రపంచ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ జీ20 సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదం-మాదకద్రవ్యాల నెట్‌వర్క్ వెన్ను విరిచేందుకు జీ20 దేశాల ఆర్థిక, పాలన, భద్రత వ్యవస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నెట్‌వర్క్ మధ్య నిధుల సరఫరా జరగకుండా చూడాలని, ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ అందకుండా చూడాలని పిలుపునిచ్చారు. ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సదస్సులో మోదీ నాలుగు అంశాలను ప్రతిపాదించారు. అందులో ఉగ్రవాదం-మాదకద్రవ్యాల నెట్‌వర్క్ మొదటి అంశం. ప్రపంచంలోని అన్ని జాతుల జీవన విధానాల్లోని ప్రత్యేకతను కాపాడుకుంటూ తర్వాతి తరాలకు అందించే విషయంలోనూ ప్రపంచ దేశాలు శ్రద్ధ చూపాలన్నారు. ఆఫ్రికా దేశాల ప్రజల నైపుణ్యాన్ని ప్రపంచ అవసరాలకు తగ్గట్లుగా పెంపొందించే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. భారత్ పది లక్షల మంది ఆఫ్రికన్ నిపుణులను తయారుచేసే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు. జీ20 దేశాలు ప్రకృతి విపత్తులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా అంతర్జాతీయ ఆరోగ్య రక్షణ వ్యవస్థలను రూపొందించాలని కోరారు. సూడాన్, కాంగో, పాలస్తీనా, ఉక్రెయిన్‌లలో శాంతి కోసం భారతదేశం పని చేస్తుందని ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఆయన జోహెన్నె్‌సబర్గ్‌లో ప్రవాస భారతీయులను కలిశారు. శనివారం బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌తో ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గూటెర్‌సతో సమావేశం అయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా ప్రధానమంత్రులతో ఒకేసారి సమావేశమయ్యారు.
అమెరికా అడ్డుకున్నా...
జీ20 దేశాధినేతల సమావేశంలో శనివారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని అడ్డుకొనేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా జీ20లో సభ్యురాలైనా ఈ సమావేశానికి రాలేదు. దక్షిణాఫ్రికాలోని తెల్లజాతి రైతుల మీద ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమెరికాకు నచ్చడం లేదు. పైగా జీ20 తీర్మానంలోని భాష అమెరికాకు అభ్యంతరకరంగా ఉంది. ఈ కారణంగా జీ20 సదస్సుకు వెళ్లొద్దని అమెరికా ప్రతినిధులను ట్రంప్ ఆదేశించారు. జీ20 తీర్మానం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారంగా మారిన కాంగో, పాలస్తీనా, ఉక్రెయిన్ తదితర యుద్ధాలను, అంతర్యుద్ధాలను పరిష్కరించేందుకు జీ20 దేశాలు చొరవ తీసుకుంటాయి. పర్యావరణ సమస్య మీద శాస్త్రీయ డేటా ఉన్నప్పటికీ దాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. జీ20 దేశాలు మాత్రం డేటా మీద విశ్వాసాన్ని ఉంచి నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాయి. వర్థమాన దేశాల అప్పుల సమస్య పరిష్కారానికి కూడా మార్గాలను అన్వేషిస్తాయి. వర్ధమాన దేశాలను కేవలం ఖనిజం ఎగుమతి దేశాలుగా మాత్రమే చూడకుండా వెలికితీసే దేశంలోనే విలువను జోడించే ప్రయత్నం చేస్తారు. అంటే, గనుల దగ్గరే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సహకరిస్తారు.