Share News

India Russia Talks: భారత్‌ రష్యా చర్చల ఎజెండాలో ఎస్‌యు-57!

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:21 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురు, శుక్రవారాల్లో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో...

India Russia Talks: భారత్‌ రష్యా చర్చల ఎజెండాలో ఎస్‌యు-57!

  • క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి పెస్కోవ్‌ స్పష్టీకరణ

  • రేపు, ఎల్లుండి భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌

న్యూఢిల్లీ, మాస్కో, డిసెంబరు 2: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురు, శుక్రవారాల్లో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో ఎస్‌-400, ఎస్‌యు-57 స్టెల్త్‌ యుద్ధవిమానాల డీల్స్‌ తప్పకుండా ఉంటాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ స్పష్టం చేశారు. అయితే, ఈ అంశంలో న్యాయమైన పోటీ జరగట్లేదనే అర్థం వచ్చేలా ఆయన నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ‘‘ఎస్‌యు-57 యుద్ధవిమానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఇది అతిశయోక్తి కాదు. పుతిన్‌ భారత పర్యటనలో ఈ అంశం కూడా ఎజెండాలో ఉంటుంది. ఈ రంగంలో మాకు పోటీదారులు చాలామంది ఉన్నారు కాబట్టి వివరాలపై చర్చ వద్దు. న్యాయమైన పోటీ అంటూ జరిగితే మాతో ఎవరూ పోటీ పడలేరు’’ అని ఆయన వ్యాఖానించారు. భారత్‌-రష్యా సంబంధాలపై అమెరికా ప్రభావం ఉండకూడదన్న అర్థం వచ్చేలా.. ‘‘ద్వైపాక్షిక సంబంధాలపై బయటి ఒత్తిళ్ల జోక్యం ఉండకూడద’’ని కూడా వ్యాఖ్యానించారు. ‘‘మనం మన బంధం భద్రంగా ఉండేలా చూసుకోవాలి. పరస్పర ప్రయోజనాలను చేకూర్చే మన వాణిజ్యబంధాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో భారత్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశలో ఉన్నందున.. ఆ డీల్‌ కుదిరాకే రష్యాతో ఎస్‌యు-57 ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. పుతిన్‌ పర్యటన సందర్భంగా ఎస్‌యు-57కు సంబంధించి చర్చ జరగొచ్చుగానీ.. ఒప్పందం ఉండకపోవచ్చని, పెస్కోవ్‌ వ్యాఖ్యలు దీన్నే సూచిస్తున్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 03:21 AM