JD Vance and his wife Usha: వాన్స్.. ఉష బంధం బీటలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:13 AM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, ఆంధ్రప్రదేశ్ మూలాలున్న చిలుకూరి ఉష మధ్య బంధం బీటలు వారుతోందా...
అమెరికాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు.. ఉష క్రైస్తవంలోకి రావాలంటూ ఇటీవల జేడీ వాన్స్ వ్యాఖ్యలు
అదే వేదికపై ఎరికాతో గాఢాలింగనం
ఉషకు విడాకులిస్తారని విశ్లేషణలు
న్యూయార్క్, నవంబరు 1: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, ఆంధ్రప్రదేశ్ మూలాలున్న చిలుకూరి ఉష మధ్య బంధం బీటలు వారుతోందా? దానికి సంకేతంగానే ఇటీవల వాన్స్.. తమ వేర్వేరు మత నేపథ్యాల గురించి బహిరంగంగా వ్యాఖ్యానించారా? ట్రంప్‌కు అత్యంత బలమై న మద్దతుదారుగా వ్యవహరించి ఈ మధ్య హత్యకు గురైన ఛార్లీకిర్క్ భార్య ఎరికా కిర్క్ ఇదే అదనుగా వాన్స్‌తో చెట్టాపట్టాలకు సిద్ధపడుతున్నారా? అమెరికాలో సోషల్ మీడియాలో ఇప్పుడే ఇదే అంశం జోరుగా షికారు చేస్తోంది. అక్టోబరు 29వ తేదీన మిసిసిపీ యూనివర్సిటీ క్యాంప్‌సలో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్ వ్యాఖ్యలు, అదే వేదిక మీద వాన్స్, ఎరికా కిర్క్ గాఢ ఆలింగనం దృశ్యాలు, అనంతరం ఎరికా మాటలు.. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఆ కార్యక్రమంలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు జేడీ వాన్స్ సమాధానమిస్తూ.. దాదాపుగా ప్రతి ఆదివారం చర్చికి తనతోపాటు ఉష కూడా వస్తుందని, అయితే, తాను క్రైస్తవం పట్ల పూర్తి అంకితభావంతో ఉన్నట్లుగా.. ఆమె కూడా ఏదో రోజు క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నానన్నారు. అదే వేదిక మీద ఉన్న ఎరికా కిర్క్.. హత్యకు గురైన తన భర్తను గుర్తు చేసుకుంటూ.. ఆయన స్థానం ఎవరూ భర్తీ చేయలేరని అంటూనే.. ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు వాన్స్‌లో కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదే సందర్భంగా ఎరికా, వాన్స్ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఇక సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి.
రాజకీయ కోణం
ఈ అంశం వెనుక ఓ రాజకీయ కోణం కూడా ఉంది. ట్రంప్‌కు, వాన్స్‌కు అమెరికాలో ప్రస్తుతం శ్వేతజాతీయవాదుల మద్దతు బలంగా ఉంది. వాన్స్ కూడా వారిని సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. అయితే, ఆయన భార్య వేరే దేశానికి చెందిన వ్యక్తి కావటం, ఆమె మతం కూడా వేరు కావటంపై కొంతకాలంగా ఈ శ్వేతజాతీయులు గుర్రుగా ఉన్నారు. ఇతర దేశీయులు, ఇతర మతస్థులు ముఖ్యంగా శ్వేతజాతీయేతరులు అమెరికాలో ఉండటం అంటే.. అమెరికన్ల అవకాశాల్ని కొల్లగొట్టటమేనని వీరి వాదన. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రణాళికబద్ధంగా ఇది జరుగుతోందని.. శ్వేతజాతీయుల స్థానాన్ని వీరు భర్తీ చేస్తున్నారంటూ ‘గ్రేట్ రిప్లే్‌సమెంట్ థియరీ’ అనే ఓ సిద్ధాంతాన్ని కూడా ప్రచారంలో పెట్టారు. ఏకంగా ఉపాధ్యక్షుడి భార్యే శ్వేతజాతీయేతర వ్యక్తి కావటం చూసి వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, శ్వేతజాతీయతకు మద్దతుగా వాన్స్ మాట్లాడటాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు.
‘భారతీయురాలు భార్యగా ఉన్న వాన్స్‌కు శ్వేతజాతికి మద్దతుగా మాట్లాడే హక్కు లేదు’ అంటూ నిక్ ఫ్యూంటెస్ అనే ఓ ప్రముఖ జాత్యంహకారి గత ఏడాది నుంచి మాటల దాడి చేస్తున్నాడు. అనేక మంది అతనికి వత్తాసు పలుకుతున్నారు. మరోవైపు, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టటానికి వీల్లేదు. దీంతో ట్రంప్ 2028లో దిగిపోయాక.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ పడాలని జేడీ వాన్స్ భావిస్తున్నారు. అయితే, భార్య ఉష జాతీయత కారణంగా తనకు శ్వేతజాతీయుల మద్దతు లభించదేమోనన్న సందేహాలు వాన్స్‌కు ఉన్నాయని.. అందుకే ఆమె నుంచి విడిపోయే అవకాశాలు ఉన్నాయని కొందరి విశ్లేషణ. దీనికి తాజాగా ఎరికా కిర్క్ మాటలు, వాన్స్‌తో ఆమె ఆలింగనం మరింత ఆజ్యం పోశాయి. జేడీ వాన్స్, ఉష ఇక విడిపోవటమే తరువాయని, కొన్ని నెలల్లోనే ఇది జరుగుతుందని అంటున్నారు. ఉషకు త్వరలోనే విడాకులిచ్చి ఎరికాను వాన్స్ వచ్చే ఏడాది చివరికి పెళ్లాడుతారంటూ న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన షానన్ వాట్స్ పేర్కొన్నారు. పదవిలో ఉండగానే విడాకులు తీసుకునే తొలి ఉపాధ్యక్షుడిగా వాన్స్ నిలుస్తారంటూ ట్రాన్స్‌జెండర్ కార్యకర్త అరి డ్రెనెన్ ట్వీట్ చేశారు.
మతస్వేచ్ఛ ఉండాలి: హిందూ అమెరికన్ ఫౌండేషన్
ఈ అంశంపై ‘హిందూ అమెరికన్ ఫౌండేషన్’ స్పందిస్తూ.. క్రైస్తవంతోపాటు హిందూమతం గురించి కూడా తెలుసుకోవాలని వాన్స్‌కు సూచించింది. హిందువులకు తమ మతాన్ని ఆచరించే హక్కు ఉంటుందన్న అంశాన్ని గుర్తించి మద్దతివ్వాలని కోరింది. వాన్స్ మద్దతుదారులు మతస్వేచ్ఛకు తీవ్ర వ్యతిరేకంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీ మద్దతుదారుల్లో కొందరు మతస్వేచ్ఛను విశ్వసించటం లేదు. కానీ, అమెరికాకు పునాదిగా ఉన్న భావనల్లో మతస్వేచ్ఛ కూడా ఒకటి. అది హిందువులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.