Trump Restrictions: రష్యా చమురుపై ఆంక్షల మంటలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:41 AM
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యాను మరింతగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
‘రాస్‌నెఫ్ట్, లుకోయిల్’లపై అమెరికా ఆంక్షలు
వాటి నుంచి చమురు కొనే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక
రష్యా సహజవాయువు దిగుమతులు,చమురు రవాణా నౌకలపై ఈయూ ఆంక్షలు
ఏడాది చివరికల్లా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుంది: ట్రంప్
ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆంక్షలతో విఘాతం: రష్యా
ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలు
ఆసియాన్ సదస్సుకు మోదీ వెళ్లట్లేదు!
వర్చువల్‌గా పాల్గొననున్న ప్రధాని
ట్రంప్ టార్గెట్ చేస్తారన్న భయం: కాంగ్రెస్
వాషింగ్టన్/ న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యాను మరింతగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు ఎగుమతులను దెబ్బతీసే చర్యలకు దిగారు. రష్యాకు చెందిన పెద్ద చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌లతో పాటు వాటి అనుబంధ కంపెనీలపై ఆంక్షలు విధించారు. అమెరికా సహా ప్రపంచ దేశాల్లోని కంపెనీలేవైనా.. సదరు రష్యా కంపెనీలతో ఎలాంటి లావాదేవీలు జరిపినా కఠిన చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ప్రకటన చేశారు. మిత్ర దేశాలన్నీ ఈ ఆంఽక్షలకు కట్టుబడి, తమతో కలిసి రావాలని కోరారు. రష్యా ఉక్రెయిన్‌లో ప్రజలను చంపడం ఆపి, వెంటనే కాల్పుల విరమణ పాటించడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా రష్యా నుంచి సహజవాయువు దిగుమతులు, చమురు రవాణా నౌకలపై ఆంక్షలు విధించింది. రష్యాకు ఆర్థిక వనరులు అందకుండా చే యడమే తమ లక్ష్యమని ప్రకటించింది. ఇక రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్న 35 దేశాల ప్రతినిధులు శుక్రవారం లండన్‌లో సమావేశం కానున్నారు. కాగా, అమెరికా తాజా ఆంక్షలపై రష్యా మండిపడింది. ఉక్రెయిన్‌లో యద్ధం నిలిపివేత దిశగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు ఈ ఆంక్షలు విఘాతం కలిగిస్తాయని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలను సమర్థంగా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ కొనుగోళ్లు ఆపేస్తుంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ‘‘రష్యా చమురులో 40ుభారత్ కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ఆ కొనుగోళ్లు నిలిపివేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టొచ్చు. ఈ ఏడాది చివరికల్లా పూర్తిగా నిలిపివేస్తుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి గతంలో రష్యా, చైనా మధ్య సంబంధాలు కూడా ఏమీ బాగుండేవి కావని.. కానీ అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్ అమలు చేసిన విధానాల కారణంగా దగ్గరయ్యాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితి మారుతోందన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలన్నదానిపై ఆసియాన్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చిస్తానని చెప్పారు.
పరస్పరం కొనసాగుతున్న దాడులు..
ఉక్రెయిన్‌లోని కీవ్, ఖార్కీవ్ సహా పది ప్రాంతాలపై రష్యా డ్రోన్, క్షిపణి దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ వైమానికదళం తెలిపింది. రష్యా బుధవారం రాత్రి 405 డ్రోన్లు, 28 క్షిపణి దాడులు చేసినట్టు వెల్లడించింది. ఈ దాడుల్లో ఆరుగురు చనిపోయారని పేర్కొంది. అదే సమయంలో తాము రష్యాలోని కీలక రసాయన కర్మాగారంపై దాడి చేసి ధ్వంసం చేశామని వెల్లడించింది.
రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించక తప్పదా!
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అ మెరికా, యూరప్ దేశాలు గతంలో పలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకున్నాయి. ఈ క్రమంలో రష్యా తమ చమురును అమ్ముకునేందుకు రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనితో రష్యా నుంచి చైనా, భారత్ చమురు దిగుమతులను భారీగా పెంచుకున్నాయి. అయితే చైనా, భారత్ చమురు కొనుగోళ్లతో సమకూరిన సొమ్మును ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోందని అమెరికా మండిపడుతోంది. ఈ క్రమంలోనే భారత్‌పై 50ు సుంకాలు కూడా విధించింది. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించాలన్న షరతు కూడా పెట్టింది. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించేందుకు భారత్ సిద్ధమైంది కూడా. దీనికితోడు రష్యా చమురు కంపెనీలపై తాజా ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు దిగుమతులు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భారత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి తక్కువ ధర చమురును భారీ స్థాయిలో దిగుమతి చేసుకుని, శుద్ధిచేసి.. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఇతర ఉత్పత్తులను అమెరికా, యూరప్ దేశాలకు విక్రయిస్తోంది. రిలయన్స్‌కు రష్యా రాస్‌నెఫ్ట్ సంస్థ నుంచి రోజుకు 5లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా ఒప్పం దం కూడా ఉంది. ఆంక్షల వల్ల రిలయన్స్‌తోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన ఐఓసీ, భారత్ పెట్రోలి యం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు రష్యా చమురు దిగుమతులను నిలిపివేయనున్నాయి.
చమురు ధరల మంటలు షురూ..
రష్యాకు చెందిన అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగానే చమురు ధరల మంటలు మొదలయ్యా యి. గురువారం ఒక్కరోజే ముడి చమురు ధర లు 4.4ు మేర పెరిగాయి. అమెరికా ఆంక్షల కారణంగా భారత్, చైనాల్లోని రిఫైనరీలు రష్యా చమురు సంస్థలతో లావాదేవీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఇతర దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోక తప్పదు. ఇది మార్కెట్లో డిమాండ్ పెంచుతుందనే ఉద్దేశంతో చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి.