Share News

Ukraine Attack: రష్యా చమురు ఎగుమతుల నిలిపివేత!

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:41 AM

చమురు ఎగుమతులపై రష్యా నిషేధం విధించింది. చమురుశుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ వరస దాడులతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ఇంధన సరఫరా వ్యవస్థలపై ....

Ukraine Attack: రష్యా చమురు ఎగుమతుల నిలిపివేత!

  • చమురుశుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులతో రష్యాలో ఇంధన కొరత

మాస్కో/న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: చమురు ఎగుమతులపై రష్యా నిషేధం విధించింది. చమురుశుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ వరస దాడులతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ఇంధన సరఫరా వ్యవస్థలపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో చమురు కొరత ఏర్పడింది. ఉక్రెయిన్‌ దాడుల కారణంగా రష్యాలో కొన్ని రోజుల్లో అయితే దాదాపు ఐదో వంతు చమురు శుద్ధి సామర్థ్యం పడిపోతోంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఇంధన ఎగుమతులను నిలిపివేయాలని రష్యా నిర్ణయించింది. ఈ నిషేధం ఈ ఏడాది చివరి వరకు అమల్లో ఉండనుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌ తెలిపారు. చమురు ఉత్పత్తుల్లో కొద్దిపాటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ కొరతను తమ వద్ద ఉన్న చమురు నిల్వలు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. రష్యా నుంచి ఎగుమతి అయ్యే పెట్రోలుపై మార్చిలో కొంత మేరకు నిషేధం విధించగా.. దాన్ని జూలైలో మళ్లీ పొడిగించారు. తాజాగా ఆ నిషేధాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు అలెగ్జాండర్‌ ప్రకటించారు. డీజిల్‌ ఎగుమతులను కూడా కొంత మేరకు నిషేధించినట్లు వెల్లడించారు. కాగా, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగానే కొన్ని చమురుశుద్ధి కర్మాగారాలను మూసివేయాల్సి వచ్చిందని రష్యా అధికారులు పేర్కొనడం గమనార్హం.

ఇరాన్‌, వెనెజువెలా నుంచి చమురు దిగుమతికి అనుమతి ఇవ్వండి: భారత్‌

రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నారన్న కారణంతో భారత్‌పై అమెరికా 25ు ప్రతీకార సుంకాలు విధించిన సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌, వెనెజువెలాల నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌ అమెరికాను కోరినట్లు సమాచారం. ఉక్రెయిన్‌తో పోరు వల్ల తనపై అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో రష్యా చమురు ధరలను భారీగా తగ్గించింది. దీంతో భారత్‌ పెద్దఎత్తున రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. చౌకగా వస్తున్న చమురుతో భారీగా లబ్ధి పొందుతోంది. కాగా, ఇరాన్‌, వెనెజువెలాలోని సరఫరాదారులు కూడా తక్కువ ధరకే చమురు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న భారత అధికారులు చమురు దిగుమతుల విషయంలో తమ వైఖరిని ట్రంప్‌ సర్కారుకు స్పష్టంచేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది.

Updated Date - Sep 27 , 2025 | 02:41 AM