Share News

Russia Denies Supplying Jet Engines: పాక్‌కు జెట్‌ ఇంజన్లు ఇవ్వట్లేదు!

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:29 AM

పాకిస్థాన్‌కు తాము ఫైటర్‌ జెట్‌ ఇంజన్లు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. భారత్‌ను ఇబ్బంది పెట్టే పని చేయబోమని తేల్చిచెప్పింది...

Russia Denies Supplying Jet Engines: పాక్‌కు జెట్‌ ఇంజన్లు ఇవ్వట్లేదు!

  • భారత్‌ను ఇబ్బంది పెట్టే పనిచేయం: రష్యా

న్యూఢిల్లీ, అక్టోబరు 5: పాకిస్థాన్‌కు తాము ఫైటర్‌ జెట్‌ ఇంజన్లు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. భారత్‌ను ఇబ్బంది పెట్టే పని చేయబోమని తేల్చిచెప్పింది. చైనా తయారీ జేఎఫ్‌-17 థండర్‌ బ్లాక్‌-3 యుద్ధ విమానాలకు అమర్చేందుకు కీలకమైన ఆర్‌డీ-93ఎంఏ ఇంజన్లను పాక్‌కు రష్యా సరఫరా చేస్తోందని.. మోదీ మార్కు దౌత్యం విఫలమైందని.. కేంద్రం దీనికి జవాబు చెప్పాలని కాంగ్రెస్‌ శనివారం డిమాండ్‌ చేసింది. ఈ వార్త అర్థరహితమని రష్యా ప్రభుత్వ వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. పాక్‌తో ఆ స్థాయిలో మిలిటరీ సహకారం లేదని స్పష్టం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ నివేదించింది. పాక్‌కు రష్యా ఫైటర్‌ జెట్లు సరఫరా చేస్తుందన్న వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ శనివారం ‘ఎక్స్‌’లో స్పందిస్తూ.. ప్రధాని మోదీ దౌత్యం దేశ ప్రయోజనాల కంటే తన ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు భారత్‌కు అత్యంత విశ్వసనీయ వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న రష్యా.. భారత్‌ అభ్యర్థనలను విస్మరించి, పాక్‌కు జెట్‌ ఇంజన్లు సరఫరా చేసేందుకు ఎందుకు ముందుకెళ్తోందో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 06 , 2025 | 02:29 AM