Share News

Russia Defends Oil Trade: భారత ఉత్పత్తులు మేం కొంటాం

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:34 AM

రష్యా చమురు కొనొద్దంటూ భారత్‌పై ఒత్తిడి తేవడం అన్యాయం, ఏకపక్షమని.. భారత్‌లో రష్యా రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారి రోమన్‌ బబుష్కిన్‌ అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడైనా సరఫరా చైన్లను దెబ్బతీస్తాయని..

Russia Defends Oil Trade: భారత ఉత్పత్తులు మేం కొంటాం

  • రష్యా చమురు కొనొద్దంటూ భారత్‌పై అమెరికా

  • ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షం

  • ఈ ఏడాది చివర్లో మోదీ-పుతిన్‌ భేటీ: రష్యా ఎంబసీ అధికారి రోమన్‌ బబుష్కిన్‌

  • భారత్‌కు చమురుపై 5 శాతం రాయితీ ఇస్తాం.. రష్యా వాణిజ్య ప్రతినిధి ఇవ్‌జెనీ వెల్లడి

  • రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకే భారత్‌పై సుంకాలు: వైట్‌హౌస్‌ సెక్రటరీ

  • భారత్‌లోని కొన్ని సంపన్న కుటుంబాలు రష్యా చమురు అమ్మి లాభపడుతున్నాయి

  • భారత్‌ కొనుగొళ్లలో 42 శాతం రష్యా నుంచే: అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రష్యా చమురు కొనొద్దంటూ భారత్‌పై ఒత్తిడి తేవడం అన్యాయం, ఏకపక్షమని.. భారత్‌లో రష్యా రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారి రోమన్‌ బబుష్కిన్‌ అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడైనా సరఫరా చైన్లను దెబ్బతీస్తాయని.. అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన భద్రతను అవి ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా ఏవైనా సవాళ్లు ఎదురైతే.. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. ‘‘అధిక సుంకాల కారణంగా భారత ఉత్పత్తులు అమెరికాకు వెళ్లలేకపోతే.. వాటికి రష్యన్‌ మార్కెట్లు స్వాగతం పలుకుతాయి’’ అని బబుష్కిన్‌ భరోసా ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.7 లక్షల కోట్ల)కు పెంచేందుకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని .. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ తగ్గిస్తుందని తాము అనుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ తిరస్కరించినా.. పాశ్చాత్యదేశాలు భారత్‌కు సమాన సహకారం అందించవని.. ఎందుకంటే అది వాటి స్వభావం కాదని.. ఇటీవలికాలంలో ఆ విషయం స్పష్టంగా వెల్లడైందని బబుష్కిన్‌ వ్యాఖ్యానించారు. భారతదేశం రష్యాకు ఎంతో ముఖ్యమని.. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తామెప్పుడూ గౌరవిస్తామని.. క్లిష్టపరిస్థితుల్లో భారత్‌కు అండగా నిలవడానికి రష్యా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


ఇండో-రష్యా సంబంధాలపై తమకు విశ్వాసం ఉందని, బయటి ఒత్తిళ్లు ఉన్నా రెండు దేశాల మధ్య ఇంధన సహకారం అలాగే కొనసాగుతుందని నమ్ముతున్నామని అన్నారు. ఇరుదేశాల మధ్య చమురు సరఫరా కొనసాగించడానికి కావాల్సిన విధానాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని.. వాణిజ్యపరంగా మిగిలిన అడ్డంకులను తొలగించుకుని, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయని బబుష్కిన్‌ వివరించారు. అలాగే.. ఇండో-రష్యా-చైనా మధ్య సంబంధాలు సైతం ప్రాంతీయ భద్రతకు ఎంతో ముఖ్యమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఈమూడు దేశాల మధ్య త్రైపాక్షిక సమావేశం త్వరలో జరగాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరికి.. మోదీ-పుతిన్‌ ఢిల్లీలో కలిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఈ భేటీకి సంబంధించి తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రష్యాను శిక్షించేందుకు ఆంక్షలు విధించిన దేశాలే ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నాయని పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి ఆయన దెప్పిపొడిచారు. ‘‘పాశ్చాత్య దేశాలు నిన్ను విమర్శిస్తున్నాయంటే.. నువ్వు చేస్తున్నది సరైనదేనని అర్థం’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లను ఆపడానికి అమెరికా సుంకాలతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు రష్యా 5 శాతం రాయితీతో భారత్‌కు చమురు విక్రయించేందుకు సిద్ధమైంది. భారత్‌తో రష్యా వాణిజ్యానికి సంబంధించి ఉప ప్రతినిధి ఇవ్‌జెనీ గ్రివా ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. అయితే, ఈ రాయితీ ఇరు దేశాల వ్యాపారుల మధ్య చర్చలపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.


సంపన్న కుటుంబాలకే లాభం..

భారత్‌లోని కొన్ని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా చమురును అమ్మడం ద్వారా 16 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 1.39 లక్షల కోట్లు) మేర లాభపడ్డాయని.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ అన్నారు. భారతచమురు కొనుగోళ్లలో 42 శాతం రష్యా నుంచే ఉంటున్నాయని.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు ఈ కొనుగోళ్లు 1 శాతం మాత్రమే ఉండేవని సీఎన్‌బీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ధ్వజమెత్తారు. ‘‘చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచింది కదా? మరి ఆ దేశంపై ట్రంప్‌ యంత్రాంగం ఎందుకు ఇదే తరహాలో సుంకాలు విధించట్లేదు?’’ అని ప్రశ్నించగా.. ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైనదని, చైనా చాలాకాలంగా రష్యా నుంచి చమురు కొంటోందని.. డ్రాగన్‌ కొనుగోళ్లు 13ు నుంచి 16 శాతానికి మాత్రమే పెరిగాయని.. భారత్‌ తరహాలో ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి లాభానికి అమ్ముకోవట్లేదని బెసెంట్‌ వివరణ ఇచ్చారు.

అందుకే సుంకాలు..

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించారని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కారొలిన్‌ లెవిట్‌ చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న (రష్యా-ఉక్రెయిన్‌) యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్‌ బలమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని.. అందులో భాగంగానే భారత్‌పై ఆంక్షలు సహా పలు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అంతేకాదు.. ఈ ఏడాది మేలో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన ఘర్షణను ఆపడానికి కూడా ట్రంప్‌ వాణిజ్యాన్ని ఒక సాధనంగా వాడారని తెలిపారు. ట్రంప్‌ జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆ ఘర్షణ అణుయుద్ధానికి దారితీసి ఉండేదన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 03:34 AM