Reza Pahlavi: తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం
ABN , Publish Date - Jun 24 , 2025 | 05:15 AM
ఇరాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలికంగా అధికార బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇరాన్ చివరి రాజు షా తనయుడు రెజా పహ్లవీ ప్రకటించారు.
ఇరాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం
అధికార వ్యవస్థ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
ఇరాన్ చివరి రాజు షా తనయుడు రెజా పహ్లవీ
ప్యారిస్, జూన్ 23: ఇరాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలికంగా అధికార బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇరాన్ చివరి రాజు షా తనయుడు రెజా పహ్లవీ ప్రకటించారు. సోమవారం ఆయన ప్యారి్‌సలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్ పాలకవర్గం విఫలమైంది. పునాదులు కదిలిపోయాయి. ఏ క్షణమైనా కూలిపోవచ్చు’’ అన్నారు. తనకు రాజ్యాధికారం అక్కర్లేదని చెప్పారు. గొప్పదేశమైన ఇరాన్ ఈ కష్టాల నుంచి బయటపడి స్థిరత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని పొందడానికి సాయం చేయాలనుకుంటున్నానని తెలిపారు. 1979లో చివరి రాజు షా ప్రభుత్వాన్నిఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ విప్లవకారులు కూలదోసినపుడు తండ్రితోపాటు 17 ఏళ్ల రెజా పహ్లవీ దేశం విడిచి వెళ్లారు. ఆయనకు ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం, తండ్రి షా పాలనలో అరాచకాలు ప్రజల స్మృతిపథంలో కొనసాగుతుండటం వల్ల ఇరాన్‌లో ప్రస్తుత అధికార వ్యవస్థ కూలిపోయినా రెజాకు అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. ఇరాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక గ్రూపులు విదేశాల్లో పని చేస్తున్నాయి. అయితే, అవేవీ ఒక్కతాటిపై లేవు. దేశంలోపల వాటికి ఎంత మద్దతు ఉందో తెలియదు. ఇరాన్ వైమానిక బలగాలను, క్షిపణి వ్యవస్థను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసిన తర్వాత అమెరికా దాని అణ్వస్త్ర కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్‌లో అధికార మార్పిడి గురించి మాట్లాడారు. ఇరాన్‌తో చర్చలు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని అమెరికా అధికారులు ప్రకటించారు. విదేశాంగ మంత్రి రుబియో ‘‘నేరుగా కలుసుకుందాం’’ అని ఇరాన్‌ను ఉద్దేశించి ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.