Share News

PM Modi During SCO Summit: ఎస్‌సీవో సదస్సు వేళ..మోదీపై హత్యాయత్నం.. భగ్నం?

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:38 AM

దాదాపు రెండు నెలల క్రితం చైనాలో ‘షాంఘై సహకార సంస్థ’ సదస్సు జరిగిన సమయంలో.. ప్రధాని మోదీపై హత్యాయత్నం జరిగిందా...

 PM Modi During SCO Summit: ఎస్‌సీవో సదస్సు వేళ..మోదీపై హత్యాయత్నం.. భగ్నం?

  • భారత్‌, రష్యా సంయుక్త ఆపరేషన్‌!

  • ‘మాతృభూమి’ వార్తా సంస్థ కథనం

  • సోషల్‌ మీడియాలోనూ వైరల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 26: దాదాపు రెండు నెలల క్రితం చైనాలో ‘షాంఘై సహకార సంస్థ’ సదస్సు జరిగిన సమయంలో.. ప్రధాని మోదీపై హత్యాయత్నం జరిగిందా? దాని వెనుక అమెరికా హస్తం ఉందా? భారత్‌, రష్యా గూఢచార సంస్థలు ఆ కుటిల యత్నాన్ని భగ్నం చేశాయా? ...నాలుగైదు రోజులుగా సోషల్‌ మీడియాలో ఇవే అంశాలతో కూడిన ఒక కథనం విస్తృతంగా వైరల్‌ అవుతోంది. కేరళకు చెందిన ‘మాతృభూమి’ వార్తాసంస్థ కూడా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఆ కథనం ప్రకారం ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ఆగస్టు 31న టియాన్జిన్‌లో ఉన్నప్పుడు ఢాకాలోని ఒక హోటల్‌లో.. అమెరికాకు చెందిన ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్‌ జాక్సన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. బంగ్లాదేశ్‌ సేనలకు శిక్షణ ఇచ్చేందుకు ఆయన అక్కడకు వచ్చినట్టు అధికారికంగా రికార్డుల్లో ఉన్నప్పటికీ.. భారతదేశ ప్రధాన నాయకత్వంపై దాడి జరిగే ప్రమాదం ఉందంటూ నిఘా వర్గాలకు ఉప్పందిన సమయంలో జాక్సన్‌ ఢాకాలో ప్రత్యక్షం కావడం రకరకాల అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే మన రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా), రష్యా ‘ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎస్‌వీఆర్‌)’ కలిసి ఉమ్మడిగా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్‌ చేపట్టాయని ‘మాతృభూమి’ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. అటు చైనాలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మోదీని తన కారులో కూర్చోబెట్టుకుని దాదాపు గంటసేపు చర్చించారు. ఆ సమయంలో కారులో వారిద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు చెప్పే మాటలను మరొకరికి అనువదించడానికి దుబాసీలు కూడా లేరు. ఆ సమయంలో పుతిన్‌.. తమ నిఘావర్గాల సమాచారాన్ని మోదీకి తెలియజేశారని ‘మాతృభూమి’ కథనం. ఆ సదస్సు నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన మోదీ.. సమీకాన్‌ ఇండియా సమావేశంలో పాల్గొన్నప్పుడు చప్పట్లు కొడుతున్న ఆహూతులను ఉద్దేశించి.. ‘నేను (చైనాకు) వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?’ అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనంలో గుర్తుచేసింది. కనిపించని ఆపదలను తాను తప్పించుకున్నానే విషయాన్ని ప్రధాని అలా సంకేత భాషలో వివరించారని పేర్కొంది.

Updated Date - Oct 27 , 2025 | 01:38 AM