Protests Erupt in PoK: పాక్ ప్రధానికి సెగ!
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:59 AM
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు ప్రధాని షెహబాజ్ షరీ్‌ఫపై నిప్పులు చెరుగుతూ రోడ్డెక్కారు. తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో...
షెహబాజ్‌కు వ్యతిరేకంగా ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనలు
బలగాల కాల్పుల్లో పది మంది ఆందోళనకారుల దుర్మరణం
న్యూఢిల్లీ, అక్టోబరు 1: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు ప్రధాని షెహబాజ్ షరీ్‌ఫపై నిప్పులు చెరుగుతూ రోడ్డెక్కారు. తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. గత మూడు రోజులుగా ఈ నిరసనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులపై భద్రతా బలగాలు మంగళ, బుధవారాల్లో జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తున్నారన్న కారణంగా పాక్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ(జేఏఏసీ) నిరసన చేపట్టింది. తాము ప్రతిపాదించిన 38 డిమాండ్లను అంగీకరించాలని కోరుతూ.. 3 రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతబడ్డాయి. అదేసమయంలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. అయితే, వీరిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు కూడా అదేస్థాయిలో ప్రయత్నించాయి. ఈ క్రమంలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో బుధవారం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘‘70 ఏళ్లుగా అమలుకు నోచుకోని ప్రాథమిక హక్కుల కోసమే మేం నిరసన చేపట్టాం. మా హక్కులను మాకు కల్పించాలి. లేకపోతే ఊరుకునేది లేదు..’’ అని జేఏఏసీ నేత షౌకత్ నవాజ్ మిర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ నిరసనకు సంబంధించి ప్లాన్-ఏ అమలు చేస్తున్నామని.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగిరాకపోతే ప్లాన్-డీ అమలు చేస్తామని, అతి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
బలోచిస్థాన్‌లో పాక్ డ్రోన్ దాడులు
బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థలే లక్ష్యమంటూ పాకిస్థాన్ సొంత ప్రజలపైనే సైనిక చర్యలు ముమ్మరం చేసింది. ఖుజ్‌దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతాన్ని ఈ సంస్థల ఆధీనం నుంచి తప్పించేందుకు భారీగా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ దాడులతో కొచావ్ ప్రాంతంలోని పంట పొలాలు ముఖ్యంగా పత్తి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరుసగా 4 రోజులుగా ఈ దాడులు జరుగుతుండటంతో ఈ ప్రాంతంలోని ప్రజలకు ఆహారం, నీరు, ఇంధనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జెహ్రీ ప్రాంతమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిందని బలోచిస్తాన్ పోస్ట్ తెలిపింది.