Share News

Gaza Peace Agreement: మోదీకి ట్రంప్‌ ఆహ్వానం

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:11 AM

ఈజిప్టులో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్‌ ఫత్తా అల్‌-సిసి ఆహ్వానించారు.

Gaza Peace Agreement: మోదీకి ట్రంప్‌ ఆహ్వానం

  • ‘గాజా శాంతి’ సమావేశానికి రావాలని పిలుపు

  • ఈజిప్టు అధ్యక్షుడు అల్‌-సిసి నుంచీ ఆహ్వానం

  • నేడు 20కి పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం

  • భారత్‌ తరఫున కేంద్ర మంత్రి కేవీ సింగ్‌ ప్రాతినిధ్యం

న్యూఢిల్లీ, అక్టోబరు 12: ఈజిప్టులో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్‌ ఫత్తా అల్‌-సిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి చివరి నిమిషంలో శనివారం మోదీకి ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే గాజా స్ర్టిప్‌లో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత్‌ తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ పాల్గొంటారని వెల్లడించాయి. ఈజిప్టు అధ్యక్ష ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్‌, అబ్దేల్‌ ఫత్తాహ్‌ అల్‌-సిసి అధ్యక్షతన 20కి పైగా దేశాల నాయకుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం షర్మ్‌-ఎల్‌ షేక్‌లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పెయిన్‌ ప్రధాని సాంచెజ్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ తదితర నాయకులు హాజరు కానున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 06:13 AM