PM Modi: దోహాలో దాడి.. ఖతార్ సార్వభౌమత్వ ధిక్కరణే
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:53 AM
ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ శ్రేణులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన దాడులను భారత్ ఖండించింది...
ఖతార్ అమీర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, వాషింగ్టన్, సెప్టెంబరు 10: ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ శ్రేణులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన దాడులను భారత్ ఖండించింది. ఈ మేరకు ఖతార్ అమీర్.. షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తహానీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దోహాలో జరిగిన దాడులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించేలా జరిగిన ఆ దాడులను భారత్ ఖండిస్తోందని తహానీతో అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి కార్యాచరణకైనా భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఇక, భారత ప్రధాని మోదీ తమకు సంఘీభావం తెలపడం పట్ల ఖతార్ అమీర్ తహానీ ధన్యవాదాలు తెలియజేశారు. మరోపక్క, దోహాలో జరిగిన దాడి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు నిర్ణయమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తమకు మిత్రదేశమే అయినా దాడిపై తనకు ముందస్తు సమాచారం లేదని వాషింగ్టన్‌లో విలేకరులతో అన్నారు. అలాగే, దోహాలో ఇజ్రాయెల్ చేసిన దాడి తన నిర్ణయం కాదంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో కూడా పోస్టు చేశారు. తమకు మిత్రదేశమైన ఖతార్‌లో దాడి జరగడం దురదృష్టకరమని కూడా పేర్కొన్నారు. మరోపక్క, ఖతార్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడి వల్ల గాజా యుద్ధాన్ని ఆపేందుకు తాను చేసిన ప్రయత్నాలకు జరిగిన నష్టంపై అమెరికా అధ్యక్షుడు దృష్టి సారించారని వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. అమెరికాకు మిత్రదేశం, సార్వభౌమత్వ దేశమైన ఖతార్‌లో ఏకపక్షంగా జరిపిన దాడులు అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, దోహాలో ఇజ్రాయెల్ చేసిన దాడి నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ బుధవారం ఖతార్‌లో పర్యటించారు.