Share News

Global Compact on AI Misuse: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి

ABN , Publish Date - Nov 24 , 2025 | 03:49 AM

ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గ్లోబల్‌ కాంపాక్ట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్‌సబర్గ్‌లో జరుగుతున్న...

Global Compact on AI Misuse: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి

  • గ్లోబల్‌ కాంపాక్ట్‌ను ఏర్పాటు చేయాలి.. జీ20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

జొహాన్నె్‌సబర్గ్‌, నవంబరు 23: ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గ్లోబల్‌ కాంపాక్ట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్‌సబర్గ్‌లో జరుగుతున్న జీ20 సదస్సు మూడో సెషన్‌ను ఉద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. ‘అందరికీ పారదర్శకమైన, న్యాయమైన భవిష్యత్తు- కీలక ఖనిజాలు-ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ అంశాలపై ఈ సెషన్‌లో చర్చిస్తున్నారు. దీనిపై మోదీ మాట్లాడుతూ.. ఏఐ వినియోగంలో తగిన మానవ పర్యవేక్షణ, డిజైన్‌ సేఫ్టీ, పారదర్శకత ఉండాలన్నారు. డీప్‌ ఫేక్‌కు, నేరాలు, ఉగ్రవాద కార్యకాలాపాలకు ఏఐని వినియోగించకుండా కఠిన పరిమితులు విధించాలని సూచించారు. ఏఐ వ్యవస్థను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏఐ అనేది మానవ సామర్థ్యాన్ని మరింత పెంచేదిగా ఉండాలని, కానీ.. అంతిమ నిర్ణయం తీసుకునే బాధ్యత మాత్రం మనుషుల చేతిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏఐ పట్ల ‘నేటి ఉద్యోగాలు’గా ఉన్న అభిప్రాయం.. ‘రేపటి సామర్థ్యాలు’గా మారాలన్నారు. ఈ విషయంలో వేగవంతమైన సృజనాత్మకత కోసం చైతన్యవంతమైన ప్రతిభ అవసరమని, తాము ఢిల్లీలో నిర్వహించనున్న జీ20 తదుపరి సదస్సులో ఈ అంశాన్ని చేరుస్తామని చెప్పారు. భారత్‌లో ఏఐ ప్రయోజనాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందేలా తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఇండియా-ఏఐ మిషన్‌ను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ప్రభావ సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వనున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు జీ20 దేశాలన్నీ హాజరు కావాలని కోరారు.

భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలి..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అనివార్యమని మోదీ అన్నారు. మొత్తంగా ప్రపంచ పరిపాలనా వ్యవస్థలోనే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాల (ఐబీఎ్‌సఏ) గ్రూప్‌ సందేశం ఇవ్వాలన్నారు. ఆదివారం ఐబీఎస్‌ఏ నేతల సదస్సులో మోదీ మాట్లాడారు. ప్రపంచం చీలికలకు, విభజనకు గురవుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో ఐక్యత, సహకారం, మానవత్వ సందేశాన్ని ఐబీఎస్‌ఏ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఐబీఎ్‌సఏ-ఎన్‌ఎ్‌సఏ సమావేశాన్ని సంస్థాగతం చేయడం ద్వారా మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ అధ్యక్షులు సిరిల్‌ రమఫోసా, లులా డా సిల్వకు భారత ప్రధాని ప్రతిపాదించారు.

Updated Date - Nov 24 , 2025 | 07:48 AM