Share News

Economic Crisis: పాక్‌ను వీడుతున్న నిపుణులు

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:14 AM

తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఉండేందుకు అక్కడ వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇష్టపడటం లేదా...

Economic Crisis: పాక్‌ను వీడుతున్న నిపుణులు

  • రెండేళ్లలో 5 వేల మంది వైద్యులు,11 వేల మంది ఇంజనీర్లు బయటకు

  • ఇది ప్రపంచానికి ‘బ్రెయిన్‌ గెయిన్‌’ఆసిమ్‌ మునీర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, డిసెంబరు 27: తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఉండేందుకు అక్కడ వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇష్టపడటం లేదా? దేశాన్ని వీడేందుకే సిద్ధమైపోతున్నారా? పాక్‌ ప్రభుత్వ లెక్కలు పరిశీలిస్తే ఔననే అనిపిస్తోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో కూలీలు, కార్మికులు ఉపాఽధి కోసం దేశాన్ని వీడుతుంటే తాజాగా నిపుణుల వలసలు ఆ దేశాన్ని తీవ్ర స్థాయిలో కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లలో పాక్‌కు చెందిన 5వేల మంది డాక్టర్లు, 11వేల మంది ఇంజనీర్లు, 13వేల మంది అకౌంటెంట్లు తమ స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈమేరకు పాకిస్థాన్‌ కు చెందిన బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ ఓవర్‌సీస్‌ ఎంప్లాయిమెంట్‌ గణాంకాలను వెల్లడించింది. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ బుద్ధి జీవులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పాక్‌కు షాక్‌కు గురిచేస్తున్న ఈ ‘బ్రెయిన్‌ డ్రెయిన్‌’ను మునీర్‌ అంతర్జాతీయ సమాజానికి పాక్‌ ఇస్తున్న బహుమతి అన్న అర్థం వచ్చేలా ‘బ్రెయిన్‌ గెయిన్‌’గా అభివర్ణించారు. ఆయన ఈ వ్యాఖ్యలపై దేశ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాక్‌ సర్కారు వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2024లో 7,27,381 మంది, ఈ ఏడాది నవంబరు వరకు 6,87,246 మంది విదేశాల్లో ఉపాధి పొందేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దేశ హెల్త్‌కేర్‌ సెక్టార్‌కు అయితే మరింత దెబ్బపడుతోంది. 2011-24 మధ్య ఆ దేశం నుంచి నర్సుల వలసలు 2,144 శాతం పెరిగాయి. ఈ ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. పాక్‌ నుంచి వేల సంఖ్యలో ప్రజలు బిక్షాటన చేసుకొని బతికేందుకు గల్ఫ్‌ దేశాలకు వెళ్లిపోయారు.

Updated Date - Dec 28 , 2025 | 06:16 AM