Asim Munir: సిందూర్ వేళ పాక్‌ను దేవుడే కాపాడాడు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:37 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌ను దేవుడే కాపాడాడని పాక్ త్రివిధ దళాల అధిపతి(సీడీఎఫ్) అసీం మునీర్ వ్యాఖ్యానించారు
ఇస్లామాబాద్, డిసెంబరు 22: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌ను దేవుడే కాపాడాడని పాక్ త్రివిధ దళాల అధిపతి(సీడీఎఫ్) అసీం మునీర్ వ్యాఖ్యానించారు. ఈనెల మొదట్లో ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఉలేమాల జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో ఖురాన్ శ్లోకాలను మునీర్ పఠించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఈ ఏడాది మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్థాన్, పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)లలో 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా నాలుగు రోజుల పాటు ఇరుదేశాల మధ్య దాడులు కొనసాగాయి. అనంతరం దాడులు ఆపేయాలని ఇరుదేశాలు ఒక అవగాహనకు రావడంతో మే 10న దాడులు ఆగిపోయాయి. ఆ సందర్భాన్ని మునీర్ ప్రస్తావిస్తూ పాక్ సాయుధ దళాలకు దేవుడు సాయం చేశాడన్నారు. ‘మేం అదే అనుకుంటున్నాం’ అని చెప్పారు. అలాగే, ప్రపంచంలో 57 ఇస్లామిక్ దేశాలు ఉండగా, వాటిలో హరమైన్ షరీఫైన్(మక్కా, మదీనా)కు సంరక్షకులు ఉండే గౌరవాన్ని దేవుడు పాకిస్థాన్‌కు కల్పించాడని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందంటూ అఫ్ఘానిస్థాన్‌పై మండిపడ్డారు. పాకిస్థాన్ పిల్లల రక్తాన్ని అఫ్ఘానిస్థాన్ కళ్లజూస్తోందన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న తెహ్రీక్-ఐ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) ఉగ్రవాద సంస్థలో 70 శాతం మంది అఫ్ఘాన్ పౌరులే ఉన్నారని ఆరోపించారు. టీటీపీ తరఫున ఉంటారో, లేక పాకిస్థాన్ తరఫున ఉంటారో అఫ్ఘాన్ ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. ఇస్లామిక్ దేశంలో ప్రభుత్వం తప్ప ఇతరులెవ్వరూ జిహాద్ కోసం ఫత్వా జారీ చేయలేరని పేర్కొన్నారు.