Share News

Nobel Peace Committee Chairman: ధైర్యం.. విశ్వసనీయత

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:12 AM

ధైర్యం, విశ్వసనీయత కలిగిన వ్యక్తులు మాత్రమే నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపిక అవుతారని నోబెల్‌ కమిటీ చైర్మన్‌ జోర్గెన్‌ వానె ఫ్రిడ్నెస్‌ స్పష్టం చేశారు....

Nobel Peace Committee Chairman: ధైర్యం.. విశ్వసనీయత

  • నోబెల్‌ శాంతి బహుమతి విజేతలకు ఉండే లక్షణాలివి

  • ట్రంప్‌ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్‌ కమిటీ చైర్మన్‌ ఫ్రిడ్నెస్‌ సమాధానం

ఆస్లో, అక్టోబరు 10: ధైర్యం, విశ్వసనీయత కలిగిన వ్యక్తులు మాత్రమే నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపిక అవుతారని నోబెల్‌ కమిటీ చైర్మన్‌ జోర్గెన్‌ వానె ఫ్రిడ్నెస్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ను ఈ బహుమతికి ఎందుకు ఎంపిక చేయలేదన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ట్రంప్‌ పేరును అసలు పరిగణించలేదన్న విధంగా ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్‌కు నోబెల్‌ దక్కనుందంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘నోబెల్‌ కమిటీ అన్ని రకాల ప్రచారాన్ని, మీడియాలో వచ్చిన వార్తలను చూసింది. శాంతి కోసం తాము కృషి చేశామని పేర్కొంటూ ఏటా వేలకు వేల ఉత్తరాలు మాకు అందుతుంటాయి. నోబెల్‌ విజేతల ఫొటోలున్న గదిలో ఈ కమిటీ సమావేశమవుతుంది. ఆ గది నిండా ధైర్యం, విశ్వసనీయత నిండి ఉంటాయి. శాంతి కోసం జరిగిన కృషి, ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ (నోబెల్‌ బహుమతి వ్యవస్థాపకుడు) వీలునామా ఆధారంగా మాత్రమే మా నిర్ణయం ఉంటుంది’ అని ఫ్రిడ్నెస్‌ స్పష్టం చేశారు. నోబెల్‌ శాంతి బహుమతి విజేత మరియా కొరినా మచాడో గురించి మాట్లాడుతూ.. అవధుల్లేకుండా విస్తరిస్తున్న అంధకారంలో ప్రజాస్వామ్య జ్వాలను మండించటానికి తనను తాను అంకితం చేసుకున్న మహిళగా అభివర్ణించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా, చీలికలు పేలికలుగా ఉన్న ప్రతిపక్ష శిబిరాన్ని సమైక్యపరచటంలో ఆమె గొప్ప పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. ‘గత ఏడాదిగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా వెనెజువెలాలోనే ఉంటున్నారు. ఆమె పోరాటం కోట్లాదిమందిలో స్ఫూర్తి నింపుతోంది. నియంతలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం పోరాడే వ్యక్తులను గుర్తించటం ఎంతో అవసరం’ అని చెప్పారు.

Updated Date - Oct 11 , 2025 | 07:44 AM