H1B visa: హెచ్-1బీ కొత్త లాటరీ విధానం
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:20 AM
హెచ్-1బీ వీసాల కేటాయింపునకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న లక్కీ లాటరీకి బదులుగా జీతం, నైపుణ్యాలకు అధికప్రాధాన్యమిచ్చేలా కొత్త ఎంపిక ప్రక్రియను ట్రంప్ సర్కారు ఈ ఏడాది సెప్టెంబరులో రూపొందించింది గుర్తుందా.....
ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి!.. ఎక్కువ జీతం- ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం
న్యూయార్క్, డిసెంబరు 23: హెచ్-1బీ వీసాల కేటాయింపునకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న లక్కీ లాటరీకి బదులుగా జీతం, నైపుణ్యాలకు అధికప్రాధాన్యమిచ్చేలా కొత్త ఎంపిక ప్రక్రియను ట్రంప్ సర్కారు ఈ ఏడాది సెప్టెంబరులో రూపొందించింది గుర్తుందా? ఆ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎ్‌స) తాజాగా విడుదల చేసింది. కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని.. 2027 ఆర్థిక సంవత్సరం (2026 సెప్టెంబరు 27 నుంచి 2027 సెప్టెంబరు 25 వరకూ ఉండే) హెచ్-1బీ వీసా కోటా నమోదు సీజన్‌కు వర్తిస్తుందని వివరించింది. అంటే.. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియ ఈ కొత్త విధానం ప్రకారం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ల కన్నా తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకురావడానికి ఈ విధానాన్ని కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని యూఎ్‌ససీఐఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ అన్నారు. కొత్త విధానం.. హెచ్-1బీ కార్యక్రమానికి సంబంధించి అసలైన ఉద్దేశాన్ని నెరవేర్చుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా హెచ్-1బీ వీసాల జారీకి డీహెచ్‌ఎ్‌స అనుసరిస్తున్న లాటరీ విధానంలో.. ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగాగానీ.. జీతం ఆధారంగాగానీ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైనవారు అమెరికాకు వచ్చేవారు. కానీ.. కొత్త విధానంలో ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతిని అనుసరిస్తారు. అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం.. ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా.. హెచ్-1బీ వీసాల కోసం వచ్చే దరఖాస్తులను.. ఎక్కువ జీతం(లెవెల్ 4), మధ్యస్థ జీతం(లెవెల్ 3), తక్కువ జీతం(లెవెల్ 2), ఎంట్రీ లెవెల్ అని 4రకాలుగా వర్గీకరిస్తారు. వీరిలో ఎక్కువ నైపుణ్యం, ఎక్కువ జీతం ఉండే లెవెల్ 4 వారికి సెలెక్షన్‌పూల్‌లో 4ఎంట్రీలు ఇస్తారు. మధ్యస్థ జీతం ఉన్నవారికి 3ఎంట్రీలు, తక్కువ జీతం ఉన్నవారికి 2ఎంట్రీలు, ప్రవేశస్థాయివారికి ఒక ఎంట్రీ ఇస్తారు. ఇలా చేయడం ఎక్కువ నైపుణ్యం ఉన్నవారే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.