Netanyahu Apologized: దోహాపై దాడికి సారీ!
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:51 AM
ఈ నెల 9న ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడులు చేసి చంపేసింది గుర్తుందా...
ఖతార్ ప్రధానికి వైట్‌హౌస్ నుంచి ఫోన్ చేసి చెప్పిన నెతన్యాహు
వాషింగ్టన్, సెప్టెంబరు 29: ఈ నెల 9న ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడులు చేసి చంపేసింది గుర్తుందా? ఆ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సోమవారం వైట్‌హౌ్‌సలో ట్రంప్ సాక్షిగా.. ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ తనీకి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్టు రాయ్‌టర్స్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు సంబంధించిన ఒప్పందంపై చర్చించేందుకు నెతన్యాహును ట్రంప్ వైట్‌హౌ్‌సకు ఆహ్వానించారు. ఈ సందర్భంగానే వారిద్దరూ ఖతార్ ప్రధానితో మాట్లాడినట్టు తెలుస్తోంది. హమాస్ నేతలపై దాడిలో భాగంగా ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకే నెతన్యాహు క్షమాపణ చెప్పినట్టు సమాచారం. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేతలతోపాటు ఖతార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ ఒకరు చనిపోయాడు. అతడి కుటుంబసభ్యులకు తాము పరిహారం చెల్లిస్తామని కూడా నెతన్యాహు హామీ ఇచ్చినట్టు తెలిసింది.