Netanyahu Apologizes: ఖతార్‌కు నెతన్యాహు క్షమాపణ
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:01 AM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఖతార్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలవంతంగా క్షమాపణ చెప్పించారా? ట్రంప్ స్ర్కిప్ట్‌ను యథాతథంగా ఫోన్‌లో చదివి ఖతార్ ప్రధానికి వినిపించారా..
ఫోన్ పట్టుకుని మాట్లాడించిన ట్రంప్?
దోహాపై దాడులకు ఇజ్రాయెల్ విచారం
మళ్లీ దాడులు చేయబోమని హామీ
అమెరికా స్ర్కిప్ట్‌ను చదివిన నెతన్యాహు
న్యూఢిల్లీ, అక్టోబరు 1: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఖతార్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలవంతంగా క్షమాపణ చెప్పించారా? ట్రంప్ స్ర్కిప్ట్‌ను యథాతథంగా ఫోన్‌లో చదివి ఖతార్ ప్రధానికి వినిపించారా? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. వైట్ హౌస్ విడుదల చేసిన ఫొటో ఒకటి ఆ ప్రశ్నలకు కారణమైంది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ట్రంప్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను తన ఒళ్లో పెట్టుకుని ఉండగా, ఓ పేపర్‌లో రాసి ఉన్న స్ర్కిప్టును నెతన్యాహు చదువుతూ ఆ ఫోన్‌లో అవతలివారికి వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ ఓవల్ ఆఫీ్‌సలో సోమవారం ఆ ఫొటో తీసి బయటకు విడుదల చేశారు. ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మెద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్-తానీతో నెతన్యాహు మాట్లాడుతున్నపుడు ఉద్దేశపూర్వకంగానే ఆ ఫొటోను తీసినట్లు చెబుతున్నారు. నెతన్యాహుతో భేటీ సందర్భంగా ఆ ఫోన్ కాల్‌ను ట్రంప్ చేయించారని, దోహాలో హమాస్ నేతలపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పించారని అధికారవర్గాలు చెప్పాయి. దోహాపై ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వారిలో సీనియర్ హమాస్ నేత ఖలీల్ అల్ హయ్యా కుమారుడు కూడా ఉన్నాడు. ముందస్తు సమాచారం లేకుండా ఇజ్రాయెల్ దాడి చేయడంపై అప్పట్లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులతో దాడి చేయడం పిరికి చర్య అని, అంతర్జాతీయ చట్టాలను గుడ్డిగా ఉల్లంఘించిందని ఇజ్రాయెల్‌పై ఖతార్ కూడా విమర్శలు చేసింది. దాడులు చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదంటూ అప్పట్లో నెతన్యాహు కూడా తమ చర్యలను సమర్థించుకున్నారు. కాగా, గాజాపై కాల్పుల విరమణ చర్చల్లో ఈజిప్టుతో పాటు ఖతార్ కూడా కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌కు చర్చలకు వచ్చిన నెతన్యాహుతో ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశంతో ఖతార్‌కు ట్రంప్ ఫోన్ కాల్ చేయించారు. ఈ సందర్భంగా పరిపరి విధాలుగా నెతన్యాహు విచారం వ్యక్తం చేశారని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని, అలాంటి దాడులు మళ్లీ చేయబోమని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ మాటలు ఆయన సొంతంగా చెప్పినవా? లేక వైట్‌హౌస్ వర్గాలు బలవంతంగా చెప్పించాయా? అనేది చర్చనీయాంశమైంది.