Nepal unrest: నేపాల్‌లో గందరగోళం.. పారిపోతున్న ఖైదీలు..
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:37 AM
నేపాల్ ఆందోళనలతో తలెత్తిన గందరగోళ పరిస్థితులను ఉపయోగించుకుని జైళ్ల నుంచి పారిపోతున్న ఖైదీల కట్టడి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించిన 60మందిని సరిహద్దు భద్రతా బలగాలు...
సరిహద్దుల్లోనే అడ్డుకున్న బలగాలు
రెండ్రోజుల్లో 60మంది అదుపులోకి..
కఠ్మాండూ, సెప్టెంబరు 11: నేపాల్ ఆందోళనలతో తలెత్తిన గందరగోళ పరిస్థితులను ఉపయోగించుకుని జైళ్ల నుంచి పారిపోతున్న ఖైదీల కట్టడి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించిన 60మందిని సరిహద్దు భద్రతా బలగాలు (ఎస్‌ఎ్‌సబీ) అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంట యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పట్టుబడిన వీరిలో చాలామంది నేపాలీ ఖైదీలు ఉన్నట్టు గుర్తించాయి. నేపాల్ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారతీయ బలగాలు పూర్తిగా అప్రమత్తం అయ్యాయి. బిహార్, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం పరిధిలోని భారతీయ భూభాగాలతో నేపాల్ సరిహద్దును పంచుకుంటోంది. కాగా, నేపాల్‌లోని పాతికపైగా జైళ్లనుంచి 15వేలమంది ఖైదీలు ఇప్పటివరకు పరారయ్యారు. వీరిలో 200మందిని పట్టుకుని తిరిగి జైళ్లకు తరలించారు. మధేశ్ ప్రావిన్సీలోని రామేఛాప్ జిల్లా జైలులో సైన్యం జరిపిన కాల్పుల్లో గురువారం ముగ్గురు ఖైదీలు మరణించారు. మరో 13మంది గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్‌ను మండించి జైలు గేట్లు బద్దలుకొట్టడానికి ఖైదీలు ప్రయత్నించారు. వా రిపై సైన్యం కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ముగ్గురు మరణించారు.
నేపాల్ తదుపరి నేతపై గందరగోళం!
‘జెన్ జెడ్’ యువత ఆందోళనలతో అతాలకుతలమైన నేపాల్‌లో అదే గందరగోళం కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎవరు ఉండాలన్నది ఎటూ తేలడం లేదు. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిని ఆందోళనకారులు ఎంపిక చేసినా.. ఆందోళనకారుల్లోని కొన్ని గ్రూపులు అందుకు సానుకూలంగా లేనట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆందోళనకారులతో నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌదెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ చర్చలు జరుపుతున్నారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం ‘భద్రకాళి’లో ఈ చర్చలు జరుగుతున్నాయని.. సుశీల కర్కితోపాటు కఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈవో కుల్మన్ ఘిసింగ్, ఽధరణ్ పట్టణ మేయర్ హర్కా సంపంగ్ పేర్లను పరిశీలిస్తున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకునే వ్యక్తి నియమిత గడువులోగా దేశంలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాగా, గురువారం కొందరు జెన్ జెడ్ గ్రూపు ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమది పూర్తిగా పౌర ఉద్యమమని, ఇందులో జోక్యం చేసుకుని ప్రయోజనం పొందేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంటును రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనల్లో మృతుల సంఖ్య 34కు చేరిందని.. 2,287 మంది గాయపడ్డారని నేపాల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కర్ఫ్యూ ఎత్తివేత..
నేపాల్‌లో సైన్యం విధించిన కర్ఫ్యూను గురువారం సాయంత్రం ఎత్తివేశారు. దీనితో జనం వివిధ అవసరాల కోసం బయటికి రావడం కనిపించింది. దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక ఆందోళనకారులు విధ్వంసంలో దెబ్బతిన్న ప్రాంతాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అంతా ఏకమై నిరసనలు తెలిపిన జెన్ జెడ్ ఆందోళనకారుల్లో విభేదాలు నెలకొన్నట్టు సమాచారం. తాత్కాలిక ప్రభుత్వాధినేత, మంత్రివర్గంలో ఎవరెవరు ఉం డాలనే దానిపై గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఆర్మీ చీఫ్, అధ్యక్షుడు, ‘జెన్ జెడ్’ గ్రూపుల ప్రతినిధులు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరుపుతున్న సమయంలోనే.. బయట పలు గ్రూపుల ప్రతినిధులు గొడవపడ్డారు.