mRNA Covid Vaccines: కరోనా వ్యాక్సిన్‌తోక్యాన్సర్‌కు చెక్!
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:33 AM
కొవిడ్ సమయంలో అమెరికాలో విస్తృతంగా తీసుకున్న ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు.. క్యాన్సర్‌పై పోరాటంలో రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తున్నట్టు తాజా..
ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు వేయించుకున్న క్యాన్సర్ పేషంట్ల జీవితకాలం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్, అక్టోబరు 26: కొవిడ్ సమయంలో అమెరికాలో విస్తృతంగా తీసుకున్న ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు.. క్యాన్సర్‌పై పోరాటంలో రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. చివరి దశల ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ బాధితులకు ఇమ్యూనోథెరపీ ప్రారంభించిన 100 రోజుల్లోపు ఫైజర్ లేదా మోడెర్నా కంపెనీలు తయారుచేసిన కరోనా టీకా (ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్) వేస్తే.. వారి రోగనిరోధక వ్యవస్థ చికిత్సకు మరింత మెరుగ్గా స్పందించి వారి జీవితకాలం పెరుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లకు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు. ‘‘ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్.. శరీరంలోని రోగనిరోధక కణాలను మేల్కొలిపే యుద్ధ భేరిలాగా పనిచేస్తోంది. రోగనిరోధకశక్తికి లొంగని కణితులు.. దీనివల్ల ఇమ్యూన్ చికిత్సకు లొంగుతున్నాయి’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆడమ్ గ్రిప్పిన్ తెలిపారు. నిజానికి వీరు ఈ పరిశోధన కరోనా టీకాలపై ప్రత్యేకంగా చేయలేదు. క్యాన్సర్లకు చెక్‌పెట్టే ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల తయారీకి చాలాకాలంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. గ్రిప్పిన్ బృందం ఇప్పటికే అందుబాటులో ఉన్న కరోనా(ఎంఆర్‌ఎన్‌ఏ) వ్యాక్సిన్ ప్రభావం ఆ టీకా తీసుకున్న క్యాన్సర్ పేషెంట్లపై ఏమైనా ఉందా అనే దిశగా అధ్యయనం చేయగా ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది. అధ్యయనంలో భాగంగా వారు ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న 1000 మంది క్యాన్సర్ పేషెంట్ల రికార్డులను పరిశీలించారు. వారిలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా తీసుకోనివారితో పోలిస్తే.. తీసుకున్నవారు రెట్టింపుకాలం జీవించినట్టు వెల్లడైంది.